
ఉత్కంఠభరితంగా సెమీస్ రేసు
గ్రూప్-2 నుంచి భారత్, సౌతాఫ్రికా జట్లు సెమీస్ చేరతాయని అంతా అనుకున్నారు. కానీ ఆదివారం నాడు నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓటమి చవిచూసింది. దీంతో భారత జట్టు సెమీస్ చేరిపోయింది. అదే సమయంలో రెండో స్థానం కోసం బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య రేసు నెలకొంది. ఈ జట్ల మధ్య జరిగే మ్యాచ్ వర్చువల్ నాకౌట్‌గా మారింది. దీనిలో గెలిచిన జట్టు నేరుగా సెమీస్ చేరుతుంది.

కీలకమైన మ్యాచ్‌లో అంపైర్ల తప్పిదం
సెమీస్ చేరే అవకాశం ఉండటంతో బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండు జట్లూ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ధాటిగా ఆడింది. కానీ వెంట వెంటనే వికెట్లు పడటంతో భారీ స్కోరు చేయలేకపోయింది. ఈ మ్యాచ్‌లో అంపైర్లు చేసిన తప్పిదం నెట్టింట వైరల్ అవుతోంది. సౌమ్య సర్కార్ అవుటైన తర్వాత షకీబల్ హసన్ క్రీజులోకి వచ్చాడు. అతను ఎదుర్కొన్న తొలి బంతికే అంపైర్లు ఎల్బీడబ్ల్యూగా అవుటిచ్చారు. ఈ నిర్ణయం ఇవ్వడానికి చాలా టైం తీసుకున్న అంపైర్లు.. తప్పుడు నిర్ణయం ఇచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

షాకైన షకీబల్ హసన్
షాదాబ్ ఖాన్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడేందుకు షకీబల్ హసన్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి అతని ప్యాడ్లను తాకింది. సుదీర్ఘ చర్చ తర్వాత అంపైర్లు అవుటిచ్చారు. అయితే షకీబల్ హసన్ రివ్యూ కోరాడు. రివ్యూలో బ్యాటును బంతి దాటే సమయంలో ఏదో చప్పుడు వినిపించింది. కానీ ఈ శబ్దం ఎలా వచ్చిందో స్పష్టంగా చెప్పలేమన్న థర్డ్ అంపైర్ అవుటిచ్చాడు. రిప్లేలో బ్యాటు నేలకు తాకలేదని స్పష్టంగా కనిపిస్తోంది. అంటే అది బ్యాటునే తాకింది. కానీ థర్డ్ అంపైర్ కూడా తప్పుడు నిర్ణయమే ఇవ్వడంతో షకీబల్ హసన్ షాకైపోయాడు. మైదానం వీడేందుకు నిరాకరించాడు. కానీ చివరకు నిదానంగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది.

వెంటాడుతున్న అంపైరింగ్ తప్పిదాలు
ఈ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ను అంపైరింగ్ తప్పిదాలు వెంటాడుతూనే ఉన్నాయి. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో వర్షం ఆగిన కాసేపటికే మ్యాచ్ ఆరంభించడాన్ని కూడా బంగ్లా జట్టు తప్పుబట్టింది. మైదానం తడిగా ఉండగానే మ్యాచ్ ఆరంభించారని ఆ జట్టు మేనేజ్‌మెంట్, బంగ్లా క్రికెట్ బోర్డు కూడా అసహనం వ్యక్తం చేసింది. అలాగే ఇదే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ ఉదంతం కూడా దుమారం రేపింది. ఈ చర్యను కూడా అంపైర్లు గుర్తించలేకపోయారు. దీన్ని వాళ్లు గమనించి ఉంటే.. బంగ్లా జట్టుకు అదనంగా ఐదు పరుగులు ఇవ్వాల్సి వచ్చేది. ఆ మ్యాచ్‌లో బంగ్లా కేవలం 5 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ పాక్ మ్యాచ్‌లో కూడా ఇలాగే జరిగింది. షకీబల్ అవుటైన తర్వాత మిగతా బ్యాటర్లెవరూ రాణించలేదు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 127 పరుగులు మాత్రమే చేయగలిగింది.


Click it and Unblock the Notifications












