IPL 2021: ఐదుగురు ఆటగాళ్లే కాదు.. ఇద్దరు అంపైర్లు ఔట్! షాక్‌లో బీసీసీఐ!

హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021పై పడింది. ఇప్పటికే ఐదు మంది ఆటగాళ్లు ఐపీఎల్ 14వ సీజన్ నుంచి తప్పుకున్నారు. ఇందులో ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లే ఉండడం విశేషం. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆండ్రూ టై, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా.. ఇంగ్లండ్ ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టోన్, టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ 2021 నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు. ఇప్పుడు వీరి సరసన ఇద్దరు అంపైర్లు కూడా చేరారు. భారత్‌కు చెందిన అంపైర్ నితిన్ మీనన్‌తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన పాల్ రీఫెల్ టోర్నీ నుంచి నిష్క్రమించారు.

ఇద్దరు అంపైర్లు ఔట్:
నితిన్ మీనన్, పాల్ రీఫెల్ ఇద్దరూ కూడా ఐసీసీ ఎలైట్ ప్యానల్ సభ్యులు. కరోనా మహమ్మారి కారణంగానే ఐపీఎల్ నుంచి తాము తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నితిన్ మీనన్ తల్లికి, భార్యకు కరోనా పాజిటివ్ రావడంతో వారితో ఉండటం కోసం అతను టోర్నీ నుంచి వైదొలిగారు. ఇక రీఫెల్ మాత్రం ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న విమానా రాకపోకల నిషేధం కారణంగా స్వదేశం వెళ్లిపోవడానికి సిద్దమయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు కూడా ధ్రువీకరించారు. అయితే టోర్నీ నుంచి ఒక్కక్కరు తప్పుకోవడంతో బీసీసీఐ ఆందోళనలో ఉందని సమాచారం.

స్థానిక అంపైర్లు బ్యాకప్‌గా ఉన్నారు:
'నితిన్ మీనన్‌కు చిన్న కుమారుడు ఉన్నాడు. తల్లికి భార్యకు కరోనా సోకడంతో కుమారుడిని చూసుకోవడానికి ఐపీఎల్ 2021ను వీడాల్సి వస్తుంది. ఇక పాల్ రీఫెల్ భయపడుతున్నారు. ఐపీఎల్ 14వ సీజన్ ముగిసిన తర్వాత స్వదేశానికి వెళ్లడానికి విమాన సౌకర్యం ఉండదనే భయంతో ముందుగా వెళ్లిపోతున్నారు. వారి నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. అయితే టోర్నీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. భారత్‌లో చాలామంది స్థానిక అంపైర్లు బ్యాకప్‌గా ఉన్నారు. వారు అంపైరింగ్ సేవల్ని ఉపయోగించుకుంటాం' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

బీసీసీఐ హామీ:
భారత్‌లో వైరస్ కరాళనృత్యం చేస్తుండడంతో ఐపీఎల్ లీగ్‌లో అలజడి రేగుతున్నది. మహమ్మారి విజృంభిస్తుండడంతో విదేశీ ఆటగాళ్లు భయపడుతున్నారు. ఇప్పటికే కొందరు ఈ సీజన్ నుంచి తప్పుకోగా.. మరికొందరు అదే బాట పట్టాలని భావిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. మే 30న టోర్నీ ముగిశాక ఆటగాళ్లను వారి స్వదేశాలకు సురక్షితంగా చేరుస్తామని మంగళవారం హామీ ఇచ్చింది. ప్లేయర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకున్నాకే టోర్నీ ముగిసినట్టు అని బీసీసీఐ పేర్కొంది.

సీఏకు లిన్ అభ్యర్థన:
ఆసీస్ ఆటగాళ్లను స్వదేశానికి తీసుకెళ్లడానికి ప్రత్యేక చార్టర్డ్ ఫ్లయిట్ ఏర్పాటు చేయాలని ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ క్రిస్ లిన్.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)ను వేడుకున్నాడు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించిన నేపథ్యంలో టోర్నీ ముగిసిన వెంటనే ఆసీస్ ఆటగాళ్లు సురక్షితంగా స్వదేశం చేరేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాల్సిందిగా క్రికెట్ ఆస్ట్రేలియాను లిన్ కోరాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications