
కోల్‌కతా: ఇంతకు ముందు నేను బంతిని పట్టుకొనే విధానం వేరుగా ఉండేది. బంతిని పట్టుకొనే విధానంలో మార్పులు చేసుకున్నా. దీంతో ఔట్ స్వింగర్లు సంధించడంలో మరింత నియంత్రణ, నిలకడ సాధించా. వికెట్లు కూడా తీస్తున్నా అని టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ తెలిపాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన డే/నైట్ టెస్టులో ఉమేశ్ 8/81 అద్భుత గణాంకాలు నమోదు చేసాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
డే/నైట్ టెస్టు మ్యాచ్ అనంతరం బీసీసీఐ తరఫున ఓపెనర్ రోహిత్ శర్మ చేసిన ఇంటర్వ్యూలో ఉమేష్ యాదవ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఉమేష్ మాట్లాడుతూ.... 'ఇంతకు ముందు నేను బంతిని పట్టుకొనే విధానం వేరుగా ఉండేది. ఒకటి రెండు బంతులు స్వింగ్ అయ్యేవి. మిగతావి కాకపోయేవి. కొన్నిసార్లు అయితే బ్యాట్స్‌మన్ కాళ్లకు తగిలి లెగ్‌సైడ్ బైస్ రూపంలో పరుగులు వచ్చేవి. ఆ గ్రిప్‌లో నియంత్రణ లేదు' అని తెలిపాడు.
'నా కోచ్‌లు, సహచరులతో మాట్లాడా. బౌలింగ్ గ్రిప్‌లో మార్పులు చేసుకున్నా. ఇది ఫలితాన్నిచ్చింది. నేను బంతిని సరిగ్గా పట్టుకున్నప్పుడు బంతిపై నియంత్రణ, స్వింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నా ఔట్ స్వింగర్ల నిలకడ కూడా పెరిగింది. మార్పు చేసుకున్నాక కొన్ని ఇన్‌స్వింగర్లు సైతం బాగా విసిరాను' అని ఉమేశ్ అన్నాడు.
మణికట్టు పొజిషన్‌లో మార్పు చేసుకున్న తర్వాత బ్యాట్స్‌మెన్‌కు ఆడటం కష్టంగా ఉంటోందని మరో పేసర్ ఇషాంత్ శర్మ వెల్లడించాడు. 'ప్రస్తుతం నా ఆటను ఆస్వాదిస్తున్నా. ఇదివరకు నా ప్రదర్శనల పట్ల చాలా ఒత్తిడికి గురయ్యేవాడిని. అప్పుడు అనేక విషయాలు నా మెదడులో మెలిగేవి. ఇప్పుడు అంతలా ఆలోచించట్లేదు. వికెట్లు ఎలా తీయాలనేదానిపైనే ఇప్పుడు నా ధ్యాసంతా నెలకొంది' అని ఇషాంత్ పేర్కొన్నాడు.