ఇస్లామాబాద్/బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్-9 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై విజయం సాధించి టైటిల్ సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ కూడా హైదరాబాద్ సారథి డేవిడ్ వార్నర్‌కు అభినందనలు తెలిపాడు.
దీంతో ఒక్కసారిగా అక్మల్‌పై క్రికెట్ అభిమానులు విరుచుకుపడ్డారు. విమర్శల వర్షం కురిపించారు. అయితే వారు విమర్శించింది.. డేవిడ్ వార్నర్‌ను అభినందించినందుకు మాత్రం కాదు.

ఐపిఎల్ టోర్నీని సాధించిన డేవిడ్ వార్నర్‌ను పాకిస్థాన్ సూపర్ లీగ్ సాధించారంటూ అభినందనలు తెలిపినందు వల్లే. ఐపిఎల్‌కి పీఎస్‌ఎల్ కూడా తేడా తెలియకుండా ఎలా క్రికెటిరయ్యారంటూ పలువురు అక్మల్‌పై మండిపడుతున్నారు.
ఆదివారం జరిగిన ఫైనల్లో బెంగళూరును ఓడించి 8 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టు ఐపిఎల్ 9 విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ విషయం ప్రపంచమంతా తెలిసిన ఈ పాకిస్థాన్ క్రికెటర్ తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందంటూ పలువురు ఎద్దేవా చేశారు.