హైదరాబాద్: పాకిస్థాన్ క్రికెటర్లకు ఇంగ్లీషు భాషపై ఉన్న పట్టు గురించి తరచూ మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇంజమామ్ ఉల్ హక్, యూనిస్ ఖాన్, షోయబ్ అక్తర్ వంటి వారెందరో వచ్చీ రాని ఇంగ్లీషుతో నవ్వుల పాలై విమర్శలు తెచ్చుకున్న సందర్భాలు అనేకం.
తాజాగా ఈ జాబితాలోకి మరో పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ సైతం చేరాడు. పాకిస్థాన్ మాజీ కోచ్ డేవ్ వాట్‌మోర్ పెట్టిన ఓ ట్వీట్ మీద ఉమర్ సోషల్ మీడియాలో స్పందించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే పాక్ మాజీ కోచ్ డేవ్ వాట్ మోర్ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టాంగిల్స్ మృతి చెందిన విషయాన్ని ట్విటర్లో తెలియజేస్తూ నివాళి అర్పించాడు.
ఈ ట్వీట్‌పై పాకిస్థాన్ క్రికెటర్ అక్మల్ స్పందిస్తూ 'చాలా బాగుంది' (వెరీ నైస్) అని ట్వీట్ పెట్టాడు. అంతేకాదు ఈ ట్వీట్‌కు ఒక స్మైలీ కూడా జోడించాడు. దీంతో విస్మయానికి గురైన నెటిజన్లు ఉమర్ అక్మల్‌పై జోకులు పేల్చారు. అక్మల్ ట్వీట్‌పై పాక్ ఆటగాడు షెజాద్ హెచ్చరించడంతో వెంటనే పొరపాటు జరిగిందని తెలుసుకుని మన్నించాలంటూ మరో ట్వీట్ పెట్టాడు.