అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య యూఏఈ జట్టును 234 పరుగుల భారీ తేడాతో చిత్తుచేసింది. ఈ విజయంలో వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయి ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వైభవ్ సూర్యవంశీ కేవలం 95 బంతుల్లో 171 పరుగులు సాధించగా.. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 433 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఈ 400 ప్లస్ స్కోరు అండర్-19 వన్డేల్లో భారత్‌కు అత్యధికం కాగా.. అండర్-19 ఆసియా కప్ చరిత్రలోనే అత్యధిక స్కోరుగా నిలిచింది.
వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత
బీహార్లోని సమస్తిపూర్‌కు చెందిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, యూఏఈ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన అద్భుతమైన ఇన్నింగ్స్‌లో ఏకంగా 14 సిక్సర్లు, 9 ఫోర్లు బాదాడు. అండర్-19 స్థాయిలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ 30 బంతుల్లో అర్థ సెంచరీ, కేవలం 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేయడం విశేషం. 9 ఫోర్లు, 14 సిక్సర్లతో కూడిన అతని 171 పరుగుల ఇన్నింగ్స్, యూత్ వన్డేల్లో భారత్ తరఫున రెండో అత్యధిక స్కోరుగా నిలిచింది. 2002లో అంబటి రాయుడు ఇంగ్లాండ్‌పై చేసిన అజేయ 177 పరుగులు అగ్రస్థానంలో ఉంది.

వైభవ్ ఆరోన్ జార్జ్ (69)తో కలిసి 212 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సూర్యవంశీతో పాటు విహాన్ మల్హోత్రా (69), ఆరోన్ జార్జ్ (69) అర్థ సెంచరీలతో రాణించారు. ఆ తర్వాత వేదాంత్ త్రివేది (38), అభిజ్ఞాన్ కుందు (32 నాటౌట్), కనిష్క్ చౌహాన్ (28) ధాటిగా ఆడటంతో భారత్ 400 పరుగుల మార్కును దాటింది.
యూఏఈ పోరాటం వృథా
434 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూఏఈ జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. 4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి, త్వరత్వరగా కీలక వికెట్లు పడగొట్టుకుంది. 48 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే యూఏఈ తరఫున పృథ్వీ మధు (50), ఉద్దిష్ సూరి (78 నాటౌట్) పోరాడి అర్థ సెంచరీలు నమోదు చేశారు. ఈ ఇద్దరూ కలిసి 85 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పినా, లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఫలితం లేకపోయింది. నిర్ణీత 50 ఓవర్లలో యూఏఈ 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ 234 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టోర్నీని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది.