అండర్-19 ఆసియా కప్ 2024లో భారత్‌కు శుభారంభం దక్కలేదు. దుబాయ్ వేదికగా శనివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 281 పరుగులు చేసింది. ఓపెనర్ షాజైబ్ ఖాన్ 147 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లతో 159 పరుగులు సాధించాడు. యూత్ వన్డేల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన పాకిస్థాన్ బ్యాటర్‌గా, అత్యధిక స్కోరు సాధించిన పాక్ ప్లేయర్‌గానూ షాజైబ్ ఖాన్ రికార్డులు నెలకొల్పాడు.
మరో ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ (60; 94 బంతుల్లో, 6 ఫోర్లు) కూడా రాణించాడు. తొలి వికెట్‌కు పాకిస్థాన్ 160 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. టీమిండియా బౌలర్లలో సమర్థ్ నాగరాజు మూడు వికెట్లు, ఆయుష్ రెండు, యుధజిత్, కిరణ్ తలో వికెట్ తీశారు. కాగా, అనంతరం ఛేదనకు దిగిన భారత్ 47.1 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది.

నిఖిల్ కుమార్ (67; 77 బంతుల్లో, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), మహ్మద్ ఇనాన్ (30; 22 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడారు. సంచలన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. తొమ్మిది బంతుల్లో ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. పాక్ బౌలర్లలో అలీ రజా మూడు వికెట్లు, అబ్దుల్ సుభాన్, ఫహమ్ ఉల్ హక్ చెరో రెండు వికెట్లు తీశారు. ఛేదన ఆరంభంలోనే టీమిండియా కీలక వికెట్లు కోల్పోయింది. 51 పరుగులకే ముగ్గురు ఔటయ్యారు.
ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన నిఖిల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. పాక్ బౌలర్ల ధాటికి మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా లక్ష్యాన్ని క్రమంగా కరిగించాడు. జట్టు స్కోరు 174 వద్ద నిఖిల్ ఔటవ్వడంతో టీమిండియా ఓటమి దాదాపు ఖరారైంది. కానీ 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇనాన్ గొప్ప పోరాట పటిమ చూపించాడు. ఎదురుదాడికి దిగి దూకుడుగా పరుగులు సాధించాడు. భారత్ నెట్‌రన్‌రేటు భారీగా నెగటివ్‌లో వెళ్లకుండా అడ్డుకున్నాడు. టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో సోమవారం జపాన్‌తో తలపడనుంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్‌తో పాటు జపాన్, యూఏఈ ఉన్నాయి.