అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన మన అమ్మాయిలు.. తాజాగా జరిగిన మ్యాచ్‌లోనూ విజయం సాధించారు. శ్రీలంకను 60 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించారు. దీంతో భారత జట్టు టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసినట్టైంది. ఈ విజయంతో సూపర్ -6లో ఎంట్రీ ఇచ్చింది.
ఒక్క పరుగు తేడాతో జస్ట్ మిస్
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగింది టీమిండియా. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు సాధించింది. తెలుగమ్మాయి ఓపెనర్ గొంగడి త్రిష త్రుటిలో హాఫ్ సెంచరీని చేజార్జుకుంది. 44 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 49 పరుగులు చేసింది. ఈమె మినహా ఇంకెవ్వరూ పెద్దగా రాణించలేదు. మిథిలా వినోద్ (16), జోషిత (14), కెప్టెన్ నిక్కి ప్రసాద్ (11), నామమాత్రపు పరుగులు చేశారు. భవికా (7), ఆయుషి (5), కమలిని (5) నిరాశ పరిచారు. లంక బౌలర్లలో ఏసేని తలగునె, ప్రముది, లిమాన్స తిలకరత్న తలో రెండు వికెట్లు తీశారు. చామోడి ప్రభోద, రష్మిక, మనుడి నానయక్కర ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.

ఆ తర్వాత లక్ష్యఛేదనలో శ్రీలంక.. భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 58 పరుగులే చేసింది. లంక జట్టులో టాప్-5 ఉన్న బ్యాటర్లలో ఏ ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. పరుగులు చేయడానికి బాగా ఇబ్బంది పడ్డారు. ఫైనల్ గా ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన రష్మిక సెవ్వండి మాత్రం 15 చేసింది. లంక జట్టులో ఈ ఇన్నింగ్స్ లో ఇదే టాప్ స్కోర్. టీమిండియా బౌలర్లలో షబ్నమ్ , జోషిత , పరుణికా సిసోధియా తలో రెండు తీశారు. వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లా తలో ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.