
చెలరేగిన బౌలర్లు
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ అండర్ 19 జట్టును భారత పేసర్లు రవి కుమార్, రాజ్ బవా ఆరంభంలోనే దెబ్బ కొట్టారు. వరుసగా వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ 61 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 100 పరుగులు కూడా చేయడం కష్టమే అనిపించింది. కానీ ఈ క్రమంలో ఆ జట్టు బ్యాటర్ జేమ్స్ రూ ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. అయితే జట్టు స్కోర్ 91 పరుగుల వద్ద ఉండగా ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది.

ఆదుకున్న జేమ్స్ రూ
ఈ దశలో జేమ్స్ సెల్స్‌తో కలిసి జేమ్స్ రూ ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. చాలా ఓపికతో బ్యాటింగ్ చేశాడు. టీమిండియా బౌలర్లు చెలరేగుతున్నప్పటికీ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా ఆడాడు. ఇండియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత సెంచరీకి చేరువయ్యాడు. ఇక సెంచరీ ఖాయమనుకున్న సమయంలో రవి కుమార్ మరో సారి సత్తా చాటాడు. అతడి బౌలింగ్‌లో జేమ్స్ రూ షాట్‌కు ప్రయత్నించగా అది క్యాచ్‌గా వెళ్లింది. ఆ క్యాచ్‌ను రాజ్ బవా అద్బుతంగా పట్టుకోవడంతో రూ ఇన్నింగ్స్ ముగిసింది. మొత్తంగా 116 బంతులు ఎదుర్కొన్న రూ 12 ఫోర్లతో 95 పరుగులు చేశాడు.

తొలి బౌలర్‌గా రాజ్ బవా
అలాగే జేమ్స్ రూ, జేమ్స్ సేల్స్ 93 పరుగుల భాగస్వామ్యానికి కూడా తెరపడింది. రూ ఔట్‌తో ఇంగ్లండ్ ఆలౌట్ కావడానికి ఇక ఎంతో సమయం పట్టలేదు. భారత బౌలర్ల ధాటికి 44.5 ఓవర్లలో ఇంగ్లండ్ 189 పరుగులకే ఆలౌట్ అయింది. జేమ్స్ సెల్స్ 34 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో రాజ్ బవా 5, రవి కుమార్ 4 వికెట్లతో చెలరేగారు. కౌశల్ థాంబే ఒక వికెట్ తీశాడు. ఫైనల్‌లో 5 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రాజ్ బవా నిలిచాడు. అలాగే ఫైనల్‌లో డకౌట్ అయిన తొలి కెప్టెన్‌గా ఇంగ్లండ్ సారథి టామ్ పెర్స్ట్ నిలిచాడు.

రషీద్, సింధు హాఫ్ సెంచరీలు
అనంతరం 190 పరుగులు మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పరుగులేమి చేయకుండానే ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రఘువంశీ డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ హర్నూర్ సింగ్, షేక్ రషీద్ రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 21 పరుగులు చేసిన హర్నూర్ సింగ్ ఔటయ్యాడు. మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించిన తర్వాత హాఫ్ సెంచరీ చేసిన తెలుగు కుర్రాడు షేక్ రషీద్ 50 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. ఆ వెంటనే కెప్టెన్ యష్ ధూల్(17) కూడా ఔటవడంతో టీమిండియా 97 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

విజేతగా భారత్
ఈ క్రమంలో నిశాంత్ సింధు, రాజ్ బవా కలిసి ఐదో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 164 పరుగుల వద్ద ఉండగా రాజ్‌బవా(35), 176 పరుగుల వద్ద ఉండగా కౌశల్ థాంబే ఔటయ్యారు.
అనంతరం మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడకుండా నిశాత్ సింధు (50*).. రాజ్ బనా(13*)తో కలిసి 47.4 ఓవర్లలో 4 వికెట్ల తేడాతో ఇండియాకు విజయాన్ని అందించాడు. మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రాజ్ బవాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక టోర్నీ మొత్తంలో రాణించిన డెవాల్డ్ బ్రెవిస్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.

ఐదో సారి విజేతగా..
ఈ విజయంతో భారత అండర్ 19 జట్టు ఐదో సారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. తద్వారా అండర్ 19 ప్రపంచకప్‌ను అత్యధిక సార్లు గెలుచుకున్న జట్టుగా ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. గతంలో మహ్మద్ కైఫ్, విరాట్ కోహ్లీ, ఉన్ముక్తు చంద్, పృథ్వీ షా నాయకత్వంలో ప్రపంచకప్ గెలిచిన యువ భారత్.. తాజాగా యష్ ధూల్ నాయకత్వంలో ఐదో సారి విశ్వవిజేతగా అవతరించింది.


Click it and Unblock the Notifications












