
అండర్ 19 ప్రపంచకప్‌లో భూకంపం రావడం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయంశంగా మారింది. విచిత్రం ఏంటంటే భూకంపం వచ్చినట్టు మ్యాచ్ ఆడుతున్న ప్లేయర్లకు కూడా తెలియలేదు. వారు ఎలాంటి అంతరాయం లేకుండా యథావిధిగా మ్యాచ్‌ను కొనసాగించారు. ఇది గమనించిన కామెంటేటర్లు భూప్రకంపనలపై వ్యాఖ్యానం చేశారు. దీనికి ఓ సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
అసలు ఏం జరిగిందంటే అండర్ 19 ప్రపంచకప్‌లో భాగంగా ఐర్లాండ్ అండర్ 19 జట్టు, జింబాబ్వే అండర్ 19 జట్టు మధ్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్ మైదానం వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆరో ఓవర్‌లో ఐర్లాండ్ బౌలర్ మ్యాథ్యూ హంఫ్రేస్ బౌలింగ్ చేశాడు. ఆ సమయంలో జింబాబ్వే బ్యాటర్ బ్రియన్ బెన్నెట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆరో ఓవర్ ఐదో బంతిని వేస్తున్నప్పుడు మైదానంలో స్వల్పంగా భూప్రకంపనలు సంభవించాయి. అయితే అక్కడ భూప్రకంపనలు వచ్చినట్టు మైదానంలో మ్యాచ్ ఆడుతున్న వారెవరికీ తెలియలేదు. యథావిధిగా మ్యాచ్ కొనసాగించారు. ఈ విషయాన్ని కామంటేంటర్లు గమనించారు. ఈ విషయాన్ని కామెంటేటర్ ఆండ్రూ లియోనార్డ్ గుర్తించాడు. ఆ సమయంలో భూప్రకంపనలు వచ్చినట్టు చెప్పాడు. 15 నుంచి 20 సెకన్ల పాటు భూమి కంపించిందని ఆయన చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో కెమెరాలతోపాటు తమ చుట్టు పక్కల అంతా షేక్ అయినట్టు ఆయన వివరించాడు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.2గా నమోదైంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అది ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులో భూప్రకంపనల సమయంలో వీడియో షేక్ అవడాన్ని గమనించవచ్చు.
కాగా ఈ మ్యాచ్‌లో జింబాబ్వే అండర్ 19 జట్టుపై ఐర్లాండ్ అండర్ 19 జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 166 పరుగులకే ఆలౌటైంది. బ్రియాన్ బెన్నెట్ 37, డేవిడ్ బెన్నెట్ 35 పరుగులతో పర్వాలేదనిపించగా మిగతా వారంతా విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో ముజామిల్ షెర్జాద్ 5 వికెట్లతో సత్తా చాటాడు. మాథ్యూ హంఫ్రీస్ 3 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యాన్ని ఐర్లాండ్ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. 32 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి ఐర్లాండ్ విజయం సాధించింది. జాక్ డిక్సన్ 78, టిమ్ టెక్టర్ 76 పరుగులతో అజేయంగా నిలిచారు. టిమ్ టెక్టర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కు ఎంపికయ్యాడు.