న్యూఢిల్లీ: అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో బుధవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో శ్రీలంక ఓడిపోయినప్పటికీ ఆ జట్టుకు చెందని ఓ ఆటగాడు మాత్రం అందర్నీ తనవైపు తిప్పుకున్నాడు. శ్రీలంక యువ స్పిన్నర్ తన రెండు చేతులతో బౌలింగ్ వేసి ఆశ్చర్యానికి గురిచేశాడు.
గ్రూపు మ్యాచులో భాగంగా బుధవారం పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచులో లంక స్పిన్నర్ కమిందు మెండిస్ అద్భుత నైపుణ్యాన్ని చూపి అందర్నీ ఆకర్షించాడు. ఈ 17ఏళ్ల ఆటగాడు తన రెండు చేతులతోనూ బౌలింగ్ వేశాడు.
చిన్న వయస్సులోనే అతడు కుడి చేతి ఆఫ్ బ్రేక్, ఎడమ చేతితో స్లో బంతులు వేయడం అనేది అద్భుతంగానే చెప్పొచ్చు. ప్రపంచ క్రికెట్‌లో ఇతడొక అరుదైన బౌలర్‌గా చరిత్రకెక్కాడు.
ఇది ఇలా ఉండగా, భారతదేశంలోనూ ఇలాంటి ఆటగాడున్నాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ టీ20టోర్నమెంటు సందర్భంగా విధర్భ జట్టు తరపున ఆడిన అక్షయ్ కర్నేవర్ రెండు చేతుల బౌలింగ్ వేసి ఆశ్చర్యానికి గురిచేశాడు.
23ఏళ్ల కర్నేవర్ ఎడమ చేతితో ఆఫ్ స్పిన్, కుడి చేతితో ఆఫ్ బ్రేక్ బంతులు వేస్తాడు. ఇతడు కుడి చేతివాటం బ్యాట్స్‌మన్. ఇతని ఆటను చూసి బరోడా క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, హార్ధిక్ పాండ్యాలు ఆశ్చర్యానికి గురయ్యారు.