
క్రికెట్ అభిమానులకు మంచి విందు భోజనం. వీకేండ్స్‌లో రెండేసి ఐపీఎల్ మ్యాచులు పెట్టే తరహాలోనే డబ్ల్యూపీఎల్‌లో కూడా ఆదివారం నాడు రెండు మ్యాచులు జరిగాయి. ఈ రెండింట్లో బ్యాటుకు, బంతికి మధ్య అద్భుతమైన పోటీ కనిపించింది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్లు అద్భుతమైన ఆటతీరుతో ఆ జట్టుకు రికార్డు స్కోరు అందించారు. అదే మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్ సమయంలో ఢిల్లీ పేసర్ టారా నోరిస్ ఏకంగా ఐదు వికెట్లు తీసుకొని సత్తా చాటింది. డబ్ల్యూపీఎల్‌లో తొలిసారి ఐదు వికెట్లు తీసుకున్న బౌలర్‌గా రికార్డు సృష్టించింది.
అలా నోరిస్ రికార్డు చూశామో లేదో.. ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లో కూడా ఇదే రికార్డు నమోదైంది. గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ తలపడిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓ మోస్తరు స్కోరు చేసింది. ఛేజింగ్ ఆరంభంలో తడబడిన యూపీ.. కిరణ్ నవగిరే అద్భుతమైన ఆటతీరుతో పుంజుకుంది. ఆ తర్వాత గ్రేస్ హారిస్ (59 నాటౌట్), ఎక్సెల్‌టోన్ (22 నాటౌట్) ధనాధన్ ఆటతో విజయం యూపీనే వరించింది. కానీ గుజరాత్ బౌలర్ కిమ్ గార్త్ తన పదునైన బంతులతో యూపీని వణికించింది. ఆమె కూడా ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో సత్తా చాటింది. దీంతో డబ్ల్యూపీఎల్‌లో ఐదు వికెట్లు తీసుకున్న రెండో బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది.
ఇలా ఒకే రోజు రెండు మ్యాచుల్లో ఇద్దరు బౌలర్లు ఫైవ్ వికెట్ హాల్స్ సాధించడం చూసిన క్రీడాభిమానులు చాలా సంతోషిస్తున్నారు. డబ్ల్యూపీఎల్‌లో భారీ స్కోర్లు నమోదవ్వాలనే ఆలోచనతో బౌండరీ లైన్ కొలతలు తగ్గించారు. కొన్నిరోజుల క్రితం ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఇదే పద్ధతి అనుసరించారు. వరల్డ్ కప్‌లో బౌండరీ లైన్‌ను కొంచెం అటూ ఇటుగా 65 మీటర్ల దూరానికి మార్చారు. అదే డబ్ల్యూపీఎల్‌లో దీన్ని ఇంకొంచెం తగ్గించి 60 మీటర్లకు కుదించారు. దీనిపై మండిపడిన ఫ్యాన్స్ కూడా ఇలా బౌలర్లు రాణించడం చూసి కొంత సంతోషిస్తున్నారు. మరి టైం గడిచేకొద్దీ డబ్ల్యూపీఎల్ ఇంకా ఎన్ని సర్‌ప్రయిజులు ఇస్తుందో? ఎంత ఉత్కంఠను పెంచుతుందో తెలియాలంటే వేచిచూడక తప్పదు మరి.