

హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా వెస్టిండిస్ జట్టుతో శుక్రవారం నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్టులో ఆడబోయే తుది జట్టును జట్టు మేనేజ్‌మెంట్ గురువారం ప్రకటించింది. రాజ్‌కోట్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో ఆడిన జట్టునే హైదరాబాద్ టెస్ట్‌లోనూ కొనసాగించాలని నిర్ణయించింది.
ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేయాలనుకున్న హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. మరోవైపు హనుమ విహారి, మయాంక్ అగర్వాల్‌లకు కూడా చోటు దక్కలేదు. బీసీసీఐ ప్రకటించిన 12 మంది ఆటగాళ్ల జాబితాలో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు సిరాజ్, విహారిల పేర్లు లేకపోవడం విశేషం.
ఇక ఈ ఇద్దరు ఆటగాళ్లు తొలి టెస్ట్‌లో సైతం బెంచ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలక్టర్లు ఎన్నిసార్లు తనను నిరాశ పరిచినా అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ మళ్లీ మళ్లీ తనని ఎందుకు ఎంపిక చేయరని మయాంక్ అగర్వాల్ ప్రశ్నించాడు. నిజానికి టెస్టుల్లో విండిస్ జట్టు గట్టి పోటీని కూడా ఇవ్వడం లేదు.
ఐదు రోజులు జరగాల్సిన మ్యాచ్ రాజ్ కోట్ టెస్టు కేవలం మూడు రోజులకే ముగిసిన సంగతి తెలిసిందే. ఇక, హైదరాబాద్ వేదికగా శుక్రవారం ప్రారంభం కానున్న రెండో టెస్టులో సైతం వెస్టిండిస్ ఐదు రోజులు ఆడే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రెండో టెస్టుకు పూర్తిస్థాయి టీమిండియాను బరిలోకి దింపాల్సిన అవసరం ఏముందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
"కొత్తవారికి తగినన్ని అవకాశాలు ఇవ్వొచ్చు కదా" అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా, మరొక నెటిజన్ "మహ్మద్ షమి తొలి టెస్టులో కాస్త ఇబ్బంది పడ్డాడు. పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌తో ఉన్నట్టు కనిపించడం లేదు. అతడి స్థానంలో సిరాజ్‌ను ఎంపిక చేస్తే బాగుండేది" అని ట్వీట్ చేశాడు.
మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సైతం జట్టు ఎంపికపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇక, మయాంక్ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. విండీస్‌పైనే అవకాశం ఇవ్వకపోతే కఠిన జట్టుపై అరంగేట్రం చేయించగలరా? అని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.