హైదరాబాద్: మొహాలి వేదికగా ఆదివారం భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ 154 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లీ ఇన్నింగ్స్‌కు, టీమిండియా విజయానికి న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ చేసిన చిన్న తప్పిదమే కారణం.
286 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హెన్రీ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఓపెనర్ రహానే (5) వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీకి ఆరు పరుగుల వద్ద ఇచ్చిన ఆ లైఫ్ భారత్ గెలుపుకు బాటలు వేసింది.
కివీస్ బౌలర్ హెన్రీ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను గల్లీలో రాస్ టేలర్ వదిలేశాడు. ఈ క్యాచ్‌తో ఔట్ నుంచి తృటిలో తప్పించుకున్న కోహ్లీ అద్భుతమైన సెంచరీతో చెలరేగి న్యూజిలాండ్‌కు మ్యాచ్‌ని దూరం చేశాడు. అంతేకాదు కీలక ఆటగాడి క్యాచ్ మిస్ చేస్తే ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో టేలర్‌కు తెలిసేలా చేశాడు.

ఈ క్యాచ్‌ని రాస్ టేలర్ పట్టి ఉంటే మ్యాచ్ స్వరూపమే మరోలా ఉండేది. అయితే ఈ క్యాచ్ మిస్ వ్యవహారంపై మ్యాచ్ అనంతరం కోహ్లీ స్పందించాడు. రాస్ టేలర్ విషయంలో తనకు కూడా చాలా బాధ కలిగించిందని కోహ్లీ పేర్కొన్నాడు. ఆటలో భాగంగా క్యాచ్ మిస్ అయిన తర్వాత అదే ఆటగాడు భారీ స్కోరు చేస్తే ఎంత బాధగా ఉంటుందో తనకు తెలుసని అన్నాడు.
ఇంతక ముందు భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో తాను ఓ క్యాచ్ మిస్ చేయడం వల్ల మెక్ కల్లమ్ 300పరుగులు చేశాడని ఈ సందర్భంగా కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. తాను ఆ రోజు అనుభవించిన బాధను టేలర్ నేడు అనుభవించి ఉంటాడని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
మొహాలిలో జరిగిన మూడో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది.