
హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి రెండు వన్డేల్లో ఓపెనర్ రోహిత్ శర్మ చేసిన పరుగులు 10, 42. మొదటి రెండు వన్డేల్లో నిరాశపరిచిన రోహిత్ శర్మ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో మాత్రం జూలు విదిల్చాడు.
పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో తానెంత పవర్‌పుల్ బ్యాట్స్‌మెనో మరోసారి నిరూపించాడు. 128 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 119 పరుగులు చేశాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 29వ సెంచరీ. ఈ సెంచరీతో రోహిత్ శర్మ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్‌గా రోహిత్‌శర్మ (29) అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (49) అగ్రస్థానంలో కొనసాగుతుండగా... విరాట్ కోహ్లీ (43), రికీ పాంటింగ్ (30) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
ఈ మ్యాచ్‌కి ముందు ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న లంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య(28)ను రోహిత్ శర్మ అధిగమించాడు. దీంతో పాటు వన్డేల్లో అత్యంత వేగంగా తొమ్మిది వేల పరుగుల మైలురాయిని సాధించిన మూడో క్రికెటర్‌గా రోహిత్ శర్మ (217) నిలిచాడు.
ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (194), ఏబీ డివిలియర్స్ (208) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. రోహిత్ శర్మ తర్వాత సౌరవ్ గంగూలీ (228), సచిన్ టెండూల్కర్ (235), బ్రియాన్ లారా (239)లు ఉన్నారు. మూడో వన్డేలో రోహిత్ సెంచరీపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.