
హైదరాబాద్: మౌంట్ మాంగునుయ్ వేదికగా ఆతిథ్య న్యూజలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో బ్రిస్టన్ నైట్ క్లబ్‌లో గొడవ కారణంగా ఇంగ్లాండ్ జట్టుకు దూరమైన బెన్ స్టోక్స్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.4 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాట్స్ మెన్లు శాంట్నర్ (52 బంతుల్లో 63 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), గుప్టిల్ (87 బంతుల్లో 50; 7 ఫోర్లు), గ్రాండ్‌హోమీ (38) రాణించగా మిగతా వారంతా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు.
ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కివీస్ ఇన్నింగ్స్‌లో నలుగురు రనౌటవడం విశేషం. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్, అలీ, స్టోక్స్ తలా రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత 224 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 37.5 ఓవర్లలో 4 వికెట్లకు 225 పరుగులు చేసింది.
ఓపెనర్ బెయిర్‌స్టో (37) జట్టుకు చక్కటి శుభారంభానివ్వగా, మోర్గాన్, స్టోక్స్ చెలరేగి ఆడారు. రూట్ (9), రాయ్ (8) విఫలంకావడంతో 47 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లాండ్‌ను మోర్గాన్ రెండు కీలక భాగస్వామ్యాలతో జట్టును ఆదుకున్నాడు. బెయిర్‌స్టోతో రెండో వికెట్‌కు 39, స్టోక్స్‌తో నాలుగో వికెట్‌కు 88 పరుగులు జత చేశాడు.
దీంతో ఇయాన్ మోర్గాన్ (62; 63 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు), బెన్ స్టోక్స్ (63 నాటౌట్; 74 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు) నిలకడగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. చివర్లో జోస్ బట్లర్ (36 నాటౌట్)తో దూకుడుగా ఆడాడు. స్టోక్స్‌తో ఐదో వికెట్‌కు అజేయంగా 51 పరుగులు జత చేసిన జట్టును గెలిపించాడు.
స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గతేడాది నైట్ క్లబ్ గొడవ కారణంగా బెన్ స్టోక్స్ బ్యాట్‌పై స్పాన్సర్షిప్ ఒప్పందాలను NB(New Balance అనే పుట్‌వేర్ తయారీ సంస్ధ) రద్దు చేసుకుంది. దీంతో ప్రస్తుతం కివీస్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌లో తన బ్యాట్‌పై ఎలాంటి స్పానర్ లేకుండానే స్టోక్స్ ఆడుతున్నాడు. ఇరుజట్ల మధ్య మూడో వన్డే శనివారం (మార్చి 3)న వెల్లింగ్టన్ వేదికగా జరుగుతుంది.