
హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఇప్పటికే సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో సైతం తొలిరోజు పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది.
ఈ సిరిస్‌లో భారత బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా పరుగుల వరద పారిస్తున్నాడు. సిడ్నీ వేదికగా గురువారం ఆరంభమైన నాలుగో టెస్టు మ్యాచ్‌లో కేవలం 199 బంతుల్లోనే 13 ఫోర్ల సాయంతో ఛటేశ్వర్ పుజారా సెంచరీ సాధించాడు. స్టార్క్ బౌలింగ్‌లో బంతిని బౌండరీకి పంపడంతో పుజారా 100 పరుగులను పూర్తి చేసుకున్నాడు.
టెస్టుల్లో పుజారాకు ఇది 18వ సెంచరీ కాగా, ఈ సిరిస్‌లో మూడోది కావడం విశేషం. అడిలైడ్ టెస్టు, మెల్‌బోర్న్ టెస్టులోనూ పుజారా సెంచరీ సాధించగా.. ఆ రెండు టెస్టులోనూ భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటికే 1,000 బంతులు ఎదుర్కొన్న పుజారా ఆస్ట్రేలియా బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొంటున్నాడు.
పుజారా సెంచరీపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.