
హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా ఆదివారం శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (3/42), యజ్వేంద్ర చాహల్ (3/46)ల అద్భుత ప్రదర్శనతో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో 2-1తో సిరిస్‌ను చేజిక్కించుకుని ఈ ఏడాది వన్డేల్లో వరుసగా 8వ సిరిస్‌ని టీమిండియా కైవసం చేసింది.
మూడో వన్డేలో 30 ఓవర్ల వరకు శ్రీలంక ఆట చూసిన ఎవరికైనా ఆ జట్టు సునాయాసంగా 300 పరుగులు దాటుతుందేమో అనిపించింది. ఓపెనర్ ఉపుల్ తరంగ దూకుడగా ఆడుతూ భారత బౌలర్లపై తన అధిపత్యం చూపుతూ బౌండరీల వర్షం కురిపించాడు. పాండ్యా ఓవర్‌లో వరుసగా ఐదు ఫోర్లు బాదాడు.
ఈ సమయంలో రంగంలోకి దిగిన భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్‌లు శ్రీలంక పనిపట్టారు. ఒక దశలో 136/1తో పటిష్టంగా ఉన్న శ్రీలంక.. 79 పరుగుల వ్యవధిలో మిగతా 9 వికెట్లు కోల్పోయింది. దీంతో భారీ స్కోరుపై కన్నే సిన లంక పూర్తి ఓవర్లు ఆడకుండానే 44.5 ఓవర్లలో 215 పరుగులకే కుప్పకూలింది.
ఓపెనర్ ఉపుల్ తరంగ (82 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 95) అద్భుత ఆటతీరుతో అలరించినప్పటికీ, వికెట్ల వెనుక ధోని మాయతో తృటిలో సెంచరీని మిస్సయ్యాడు. అప్పటికి స్కోరు 189/5. చాహల్, కుల్‌దీప్, పాండ్య (2/49) పోటీపడి వికెట్లు తీయడంతో లంక బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు వరుస కట్టారు.
మరో ఆటగాడు సమరవిక్రమ (57 బంతుల్లో 5 ఫోర్లతో 42) మినహా ఎవరూ రాణించలేకపోయారు. అనంతరం 216 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో చెలరేగడంతో 32.1 ఓవర్ల లో 2 వికెట్లకు 219 పరుగులు చేసింది. కుల్దీప్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా, ధావన్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచారు.
జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన స్పిన్నర్లు కుల్దీప్, చాహల్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.