
మాంచెస్టర్: ప్రపంచకప్ హ్యాట్రిక్ హీరో మహమ్మద్ షమీకి మళ్లీ నిరాశే ఎదురైంది. తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లోనూ అతణ్ని జట్టులోకి తీసుకోలేదు టీమ్ మేనేజ్‌మెంట్. తుది జట్టులో మహమ్మద్ షమీని తీసుకోలేదు. అతని స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు చోటు కల్పించింది. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్న టీమిండియా తరఫున ఏకైక బౌలర్ మహమ్మద్ షమీ. అతణ్ని తుది జట్టులో తీసుకోకపోవడంపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. అయినప్పటికీ.. వాటిని పెడచెవిన పెట్టింది.
ఏ మాత్రం పట్టించుకోలేదు. మహమ్మద్ షమీ స్థానంలో భువనేశ్వర్ కుమార్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ఈ వ్యవహారం మొత్తం ట్విట్టరెటీస్‌ల చేతికి పని చెప్పింది. తమదైన శైలిలో చురకలు అంటిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారు. టీమ్ సెలెక్షన్‌పై మెమెలతో దాడికి దిగుతున్నారు.ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఇప్పటిదాకా మహమ్మద్ షమీ నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. అద్భుతంగా రాణించాడు. భువనేశ్వర్ కుమార్ కాలి కండరాలు పట్టేయడం వల్ల మ్యాచ్‌లకు దూరం అయినప్పటికీ.. ఆ లోటు కనిపించనివ్వలేదు షమీ.
చక్కగా, కుదురుగా బౌలింగ్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ సైతం నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో గెలుపు దిశగా దూసుకెళ్తున్న ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్‌మెన్లకు ముకుతాడు వేశాడు. చివరి ఓవర్‌లో 16 పరుగులు అవసరమైన దశలో హ్యాట్రిక్ తీసుకుని నడ్డి విరగ్గొట్టాడు. ఆ తరువాతి మ్యాచ్‌లోనూ రాణించాడు. ఇంగ్లండ్‌పై కాస్త భారీగానే పరుగులు సమర్పించుకున్నప్పటికీ.. అయిదు వికెట్లను పడగొట్టిన చరిత్రనుతన పేరు మీద లిఖించుకున్నాడు. అయినప్పటికీ- టీమ్ మేనేజ్‌మెంట్ అతణ్ని దూరం పెట్టింది.