
ముంబై: క్రికెట్ ఆడే దేశాలన్నీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మకాం వేశాయి. ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో పరస్పరం తలపడుతోన్నాయి. ఛాంపియన్‌గా ఆవిర్భవించడానికి పోటీ పడుతోన్నాయి. ఈ రేసు నుంచి వెస్టిండీస్ తప్పుకొంది. గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. సూపర్ 12 చేరుకోలేక చేతులెత్తేసిందీ మాజీ ఛాంపియన్. ఈ సంవత్సరం ఛాంపియన్ ఎవరనేది నవంబర్ 13వ తేదీన జరిగే ఫైనల్స్‌లో తేలుతుంది.
ఈ పరిణామాల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో తాజా అప్‌డేట్ బయటికొచ్చింది. వచ్చే సంవత్సరం నిర్వహించబోయే ఐపీఎల్ సీజన్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ నిర్వహించబోయే వేలం పాటకు సంబంధించిన తాజా సమాచారం ఇది. ఈ సీజన్ కోసం బీసీసీఐ- వేలంపాటను సిలికాన్ సిటీ బెంగళూరులో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా అక్కడే ఉండొచ్చంటూ మొదట్లో వచ్చిన అంచనాలు తలకిందులయ్యాయి.
బెంగళూరే కాదే.. అసలు భారత్‌లోనే ఐపీఎల్ 2023 వేలంపాటను నిర్వహించట్లేదు బీసీసీఐ. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో చేపట్టాలని నిర్ణయించింది. ఇది ప్రాథమిక నిర్ణయమే. అన్నీ సవ్యంగా కుదిరితే- ఐపీఎల్ 2023 వేలంపాటకు ఇస్తాంబుల్ వేదికగా మారుతుంది. ఫ్రాంఛైజీల యాజమాన్యాలు, ప్రతినిధులందరూ రెక్కలు కట్టుకుని అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ దిశగా అన్ని ఏర్పాట్లను మొదలుపెట్టినట్టే కనిపిస్తోంది బీసీసీఐ.
ఇస్తాంబుల్‌కు వెళ్లడం కుదరకపోతే రెండో ఆప్షన్‌గా బెంగళూరులోనే ఈ వేలంపాటను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. వచ్చే సంవత్సరం మార్చి మూడో వారంలో ఐపీఎల్ 2023 వేలంపాటలను నిర్వహించే అవకాశం ఉంది. అప్పటికి పరిస్థితులు అనుకూలించకపోతే మే చివరి వారం లేదా జూన్ మొదటివారంలో దీన్ని ఏర్పాటు చేయొచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్ ముగిసిన తరువాత ఫ్రాంఛైజీలు తమ జట్టు నుంచి రిలీజ్ చేసే ప్లేయర్ల వివరాలను బీసీసీఐకి అందజేయొచ్చని తెలుస్తోంది.