ఫాఫ్ ఒక్కడే..
డుప్లెసిస్ కేప్టెన్సీ నాక్ ఆడాడు. జట్టు బ్యాటింగ్ భారాన్ని పూర్తిగా అతనొక్కడే మోశాడు. మిడిల్ ఆర్డర్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్ కేప్టెన్‌కు కొద్దో, గొప్పో అండగా నిలిచారంతే. మ్యాడ్ మ్యాక్సీ 11 బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్సర్‌తో 23 పరుగులు చేశాడు. షాబాజ్ అహ్మద్ 22 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఇందులో ఒకే ఒక్క ఫోర్ రికార్డయింది. కేప్టెన్ ఒక్కడే చివరి వరకూ నిలబడ్డాడు. చివరి ఓవర్ అయిదో బంతికి భారీ షాట్‌కు సెంచరీ చేద్దామని ప్రయత్నించి.. అవుట్ అయ్యాడు.
కోహ్లీ గోల్డెన్ డక్..
విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో గోల్డెన్ డక్ నమోదు చేశాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియర్ దారి పట్టాడీ వరల్డ్ క్లాస్ బ్యాటర్. రెండో ఓవర్‌ను సంధించిన దుష్మంత చమీర బ్యాక్ అండ్ బ్యాక్ రెండు వికెట్లు నేలకూల్చాడు. అయిదో బంతికి అనూజ్ రావత్ అవుట్ అయ్యాడు. ఆరో బంతిని విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. అతను సంధించిన బంతిని షాట్ ఆడబోయిన కోహ్లీ.. టైమింగ్ మిస్ అయ్యాడు. ఆ బంతి కాస్తా బ్యాక్ వర్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న దీపక్ హుడా చేతుల్లో వాలింది. అప్పటికి జట్టు స్కోరు ఏడు పరుగులే.
నిర్వేదంతో కూడిన నవ్వు..
గోల్డెన్ డకౌట్ తరువాత విరాట్ కోహ్లీ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్.. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. నిర్వేదంతో కూడిన ఓ నవ్వు నవ్వుతూ వెనక్కి మళ్లాడు కోహ్లీ. నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితిని అనుభవించినట్లు కనిపిస్తోంది కోహ్లీ. జరిగిందేదో అర్థం చేసుకునే లోపే విరాట్ కోహ్లీ పెవిలియన్ దారి పట్టాడు. సాధారణంగా కింగ్ కోహ్లీ- గోల్డెన్ డకౌట్ కావడం చాలా అరుదు. అలాంటిది- ఈ కీలకమైన మ్యాచ్‌లో అదే తరహాలో అవుట్ కావడం అటు అభిమానులను కూడా ఆశ్చర్యానికి, ఆవేదనకు గురి చేసింది. కుర్చీల్లో నుంచి లేచి.. నెత్తిన చెయ్యి పెట్టుకుని మరీ విరాట్ కోహ్లీ వెనుదిరగడాన్ని తిలకించారు.
ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ను వాడేసిన టీఎస్ఆర్టీసీ..
గోల్డెన్ డకౌట్ అయిన తరువాత విరాట్ కోహ్లీ ఇచ్చిన ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ను తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ వాడేసుకుంది. ఆ ఎక్స్‌ప్రెషన్స్‌తో కూడిన ఓ ఫొటోను టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌పై ట్వీట్ చేశారు. బస్ పాస్‌ల కోసం దీన్ని వినియోగించుకున్నారు. కండక్టర్ వచ్చి పాస్ అడిగినప్పుడు, బస్ పాస్ ఇంట్లో మర్చిపోయిన మన రియాక్షన్.. అంటూ దానికి ట్యాగ్ లైన్ జోడించారు. మీరు ఎప్పుడైనా పాస్ మర్చిపోయి బస్ ఎక్కారా?.. అలాంటి సందర్భాన్ని పంచుకోవాలని సజ్జనార్ నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.


Click it and Unblock the Notifications
