క్రికెట్ ఆడుతూ మైదానంలోనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. వేర్వేరు ప్రాంతాల్లో ఈ విషాధకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగిన ఓ ఘటనలో వికాస్ (34) అనే టెకీ గ్రౌండ్‌లోనే ప్రాణాలు విడిచాడు. నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న వికాస్ రన్స్ తీస్తూ పిచ్ మధ్యలోకి రాగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
వెంటనే సహచరులు అప్రమత్తమై వికాస్‌ను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే వికాస్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టంలో వికాస్ గుండెపోటుతో మరణించినట్లు తేలింది. అయితే వికాస్ గతంలో కరోనా బారినపడి కోలుకున్నాడని సమాచారం. అనంతరం ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి క్రికెట్ ఎక్కువగా ఆడుతుండేవాడు. ఈ క్రమంలో క్రికెట్ ఆడుతూనే వికాస్ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

మహారాష్ట్ర ముంబయిలో మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతున్న 52 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మాతుంగాలోని దాడ్కర్ మైదానంలో 50 ఏళ్ల పైబడిన వారికి క్రికెట్ టోర్నీ నిర్వహించారు. అయితే స్థలం కొరత కారణంగా ఒకే మైదానంలో వేర్వేరుగా రెండు మ్యాచ్‌లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పక్కనే జరుగుతున్న మరో మ్యాచ్‌లో ఓ బ్యాటర్ కొట్టిన బాల్.. సదరు వ్యక్తి తలకు బలంగా తగలింది.
కుప్పకూలిపోయిన ఆ వ్యక్తిని హుటాహుటిన సహచర ఆటగాళ్లు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, ఈ సంఘటనపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.