హైదరాబాద్: భారత క్రికెట్‌లో సమూల మార్పుల కోసం జస్టిస్ లోధా కమిటీ సూచించిన సంస్కరణలను పాక్షికంగా అమలు చేసేందుకు బీసీసీఐ ముందుకు వచ్చింది. అయితే ఐదు వివాదాస్పద సూచనలను మాత్రం పక్కన బెట్టింది.
ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం)లో నిర్ణయం తీసుకుంది. లోధా సంస్కరణల్లో వివాదాస్పద అంశాల పరిశీలనకు సుప్రీం కోర్టు అంగీకరించిన నేపథ్యంలో అవి మినహా మిగిలిన వాటికి బీసీసీఐ ఆమోదం తెలిపింది.

'ఆ ఐదు మినహా లోధా కమిటీ సంస్కరణలను అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది' అని సమావేశం అనంతరం బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి చెప్పాడు. ఇక ఆ ఐదు సంస్కరణల విషయమై వచ్చేనెల 18న జరిగే విచారణలో నిర్ణయం తీసుకుంటామని ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల ప్రకటించింది.
ఒక రాష్ట్రానికి ఓకే ఓటు, అపెక్స్ కౌన్సిల్, ఆఫీసు బేరర్ల వయోపరిమితి, ఆఫీసు బేరర్ల పదవీకాలం, జాతీయ సెలెక్షన్ కమిటీ పరిమాణం ఇలా ఈ ఐదు మినహా మిగిలిన వాటిని పాటించేందుకు బీసీసీఐ అంగీకరించింది.
మరోవైపు ఏజీఎంకు ఆఫీస్ బేరర్లు మాత్రమే హాజరుకావాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను బీసీసీఐ కచ్చితంగా అమలు చేసింది. బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీని కూడా సమావేశానికి హాజరు కానివ్వలేదు. జోహ్రీ సహా బోర్డు ఉద్యోగులందరూ సమావేశం నుంచి వెళ్లిపోవాలని అమితాబ్ చౌదరి చెప్పడం విశేషం.