
ఐపీఎల్ మినీ వేలానికి గడువు దగ్గర పడుతోంది. ఈ వేలంలో మొత్తం 405 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా తమకు ఆసక్తి ఉన్న ఆటగాళ్ల వివరాలతో షార్ట్ లిస్టులు సమర్పించేశాయి. ఈ క్రమంలోనే మొత్తం 87 ఖాళీల కోసం 405 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నట్లు ఐపీఎల్ యాజమాన్యం వెల్లడించింది.
వీరిలో 273 మంది విదేశీ ఆటగాళ్లు కాగా, 132 మంది భారతీయ ఆటగాళ్లు ఉన్నారు. ఇంగ్లండ్ నుంచి బెన్ స్టోక్స్, శామ్ కర్రాన్, జో రూట్, జేజే రాయ్, బ్రూక్స్, అదిల్ రషీద్, టాప్లే తదితర ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. ఇంగ్లండ్ నుంచి అత్యధికంగా 25 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటున్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా నుంచి కామెరూన్ గ్రీన్, క్రిస్ లిన్, ఆడమ్ జంపా తదితరులతోపాటు మొత్తం 20 మంది ఈ వేలంలో ఉన్నారు. జింబాబ్వే నుంచి సికందర్ రజా, బ్లెస్సింగ్ ముజరబానీ మాత్రమే ఈ వేలంలో ఉండగా.. నమీబియా నుంచి కూడా ఇద్దరు ఆటగాళ్లు వేలంలో షార్ట్ లిస్ట్ అయినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో ఐపీఎల్ ట్రేడింగ్ విండో ఇంకా ముగియలేదు. ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలని అనుకుంటున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్.. కీలకమైన ఆటగాడి కోసం మంతనాలు జరుపుతోందని తెలుస్తోంది. జట్టులో పెద్దగా ఉపయోగించుకోని కార్తీక్ త్యాగిని ముంబై ఇండియన్స్‌తో ట్రేడ్ చేసుకోవాలని కావ్య ఆలోచిస్తోందట. అతని స్థానంలో 'బేబీ ఏబీ'గా పేరొందిన ట్రిస్టియన్ స్టబ్స్‌ను తీసుకోవాలని అనుకుంటోందట. పూరన్‌ను కూడా వదిలేయడంతో సన్‌రైజర్స్ జట్టులో మంచి వికెట్ కీపింగ్ బ్యాటర్ స్థానం ఖాళీగా ఉంది. స్టబ్స్‌తో ఆ ఖాళీని పూరించాలని కావ్య ప్లాన్ చేస్తోందట మరి ముంబై జట్టు ఈ ట్రేడింగ్‌కు ఒప్పుకుంటుందో లేదో చూడాలి.