సూపర్ ఓవర్ ఆలోచనే రాలేదు.. బ్యాగు ముందే సర్ధేసుకున్నా: రోహిత్

హామిల్టన్: సూపర్ ఓవర్ ఆడాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. అందుకే నాకు సంబంధించిన వస్తువులన్నీ ముందే బ్యాగులో సర్దేసుకున్నా అని టీమిండియా 'హిట్‌మ్యాన్' ఓపెనర్ రోహిత్ శర్మ తెలిపారు. న్యూజిలాండ్ బ్యాటింగ్‌ను చూస్తే సూపర్ ఓవర్ గురించి ఆలోచనే రాలేదని చెప్పారు. ఈ మ్యాచ్‌ను నేను గెలిపించలేదు, మహ్మద్ షమీ గెలిపించాడు అని రోహిత్ అన్నారు. బుధవారం ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.

సూపర్ ఓవర్ ఎప్పుడూ ఆడలేదు:
'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ... 'సూపర్ ఓవర్‌లో గతంలో ఎప్పుడూ బ్యాటింగ్ చేయలేదు. అసలేం ఏం చేయాలో అర్థం కాలేదు. తొలి బంతి సింగిల్ తీసే ప్రయతంలో.. మూడు, నాలుగు బంతుల తర్వాత ఒత్తిడి పెరిగిపోయింది. చివరి రెండు బంతుల వరకు నేను ఒక్కటే అనుకున్నా.. బౌలర్ తప్పిదం చేసేవరకు వేచిచూడాలని. చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి జట్టుకు విజయాన్ని అందించడం ఆనందంగా ఉంది' అని తెలిపారు.

బ్యాగు ముందే సర్ధేసుకున్నా:
'సూపర్ ఓవర్ ఆడాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. అందుకే నాకు సంబంధించిన వస్తువులన్నీ ముందే బ్యాగులో సర్దేసుకున్నా. నా వస్తువులన్నీ అందులోనే ఉన్నాయి. మళ్లీ మైదానంలోకి వెళ్లానని తెలియడంతో.. బ్యాగు కోసం వెతికా. అది ఎక్కడుందో తెలియకపోవడంతో.. అబ్‌డామిన్ గార్డ్ వెతికేందుకు ఐదు నిమిషాలు పట్టింది. కివీస్ బ్యాటింగ్‌ను చూస్తే సూపర్ ఓవర్ గురించి ఆలోచనే రాలేదు. వారు సులభంగా మ్యాచ్ గెలుస్తారని అనిపించింది' అని రోహిత్ పేర్కొన్నారు.

చెత్త బంతుల కోసం వేచి చూశా:
'సూపర్ ఓవర్ పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడంపై పెద్దగా సాధనేమీ ఉండదు. అదే బౌలర్‌కైతే ఏ ఓవర్‌నైనా ఒకేలా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో నేను 60 పరుగులు చేయకుంటే.. నా బదులు శ్రేయస్ లేదా మరొకరు వచ్చేవారు. టీమ్ సౌథీ బాగా బౌలింగ్ చేశాడు. సాధారణంగా సూపర్ ఓవర్‌లో బౌలర్‌పై ఒత్తిడి ఉంటుంది. అందుకే నేను చెత్త బంతుల కోసం వేచి చూశా. చివర్లో క్రీజులోనే ఉండాలా? ముందుకొచ్చి ఆడాలా? అన్న ఆలోచనలు మెదిలాయి. అయితే సౌథీ నా పరిధిలో బంతులు వేయడంతో భారీ షాట్లు ఆడాను' అని రోహిత్ చెప్పుకొచ్చారు.

కుర్రాళ్లంతా బాగా ఆడుతున్నారు:
'కుర్రాళ్లంతా బాగా ఆడుతున్నారు. ఎవరికి అవకాశం వచ్చినా అందిపుచ్చుకుంటున్నారు. లంకపై శిఖర్ ధావన్ కీలకమైన హాఫ్ సెంచరీ బాదాడు. గత 7-8 టీ20ల్లో కేఎల్ రాహుల్ అర్ధ శతకాలు చేస్తూనే ఉన్నాడు. జట్టుకు ఇది శుభసూచకం. జట్టులో ఎక్కువ మంది ఫామ్‌లో ఉండటం చాలా కీలకం. జట్టు కూర్పును నిర్ణయించేందుకు కెప్టెన్, యాజమాన్యానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మా విజయాల జోరును మేం ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాం' అని హిట్‌మ్యాన్ అన్నారు.

షమీ బౌలింగే విజయం అందించింది:
'మొహమ్మద్ షమీ వేసిన ఆఖరి ఓవర్ ఎంతో కీలకం. నా సిక్సర్లు కాదు నిజానికి అతడి బౌలింగే విజయం అందించింది. మంచు కురుస్తున్నప్పుడు 9 పరుగులను కాపాడటం చాలా కష్టం. కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ లాంటి టాప్ క్లాస్ ఆటగాళ్లు ఉన్నా.. షమీ అద్భుతంగా బంతులేసాడు. విలియమ్సన్ బాగా పోరాడాడు. మేం చివరి వరకు ఆశలు వదులుకోలేదు' అని రోహిత్ తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications