న్యూఢిల్లీ: తాము బాగా ఆడినా తప్పులు వెతుకుతున్నారని, మద్దతుగా నిలవాల్సిన మాజీ ఆటగాళ్లు విమర్శలు చేస్తున్నారని, అలాంటి వారి పైన గౌరవం పోతోందని, తమకు చాలా బాధ కలుగుతోందని భారత క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం అన్నాడు.
జట్టు పైన ఇటీవలి కాలంలో మాజీలు చేస్తున్న విమర్శలు తీవ్రంగా బాధించాయన్నాడు. వరుస విజయాలు సాధిస్తున్న జట్టు పైన విమర్శల చేయడానికి మాజీలంతా కొత్త దారి ఎన్నుకున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నాడు. కోహ్లీ ఎవరి పేరు పెట్టకుండా విమర్శలు గుప్పించాడు.
తన సారథ్యంలో వరుసగా రెండు టెస్టు సిరీస్‌లు గెలిచిన కోహ్లీ జట్టుపై వచ్చిన ప్రతి విమర్శనూ తిప్పి కొట్టాడు. తమ గెలుపు గాలివాటంగానో లేక పిచ్‌ల నుంచి లబ్ది పొందో రాలేదన్నాడు. జట్టులో ప్రతి ఆటగాడి ప్రతిభతోనే విజయాలు దక్కాయన్నాడు.

ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఆటగాళ్లు కూడా విమర్శలు చేస్తున్నారని, దేశం తరఫున ప్రాతినిథ్యం వహించనివారికి మాట్లాడే అర్హత లేదన్నాడు. వారికి అంతర్జాతీయ క్రికెటర్ ఏం ఆలోచిస్తాడో కూడా తెలియదన్నాడు.
అలాంటి వారు విమర్శలు చేసి తమను చాలా బాధించాయని, అన్నీ తెలిసిన మాజీ క్రికెటర్లు మేం ఏం చేయాలో బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారని, నలుగురికి తెలిసేవిధంగా ఆటగాడి లోటుపాట్లపై సలహాలు కాకుండా విమర్శలు చేస్తే సదరు ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడని, వారు తెలుసుకుంటారని అనుకుంటున్నానని అన్నాడు.
కెప్టెన్‌గా తొలి రెండు సిరీసుల్లో విజయాలు అందుకోవడం గర్వించే విషయమన్నాడు. ఆస్ట్రేలియా లేదా మరో దేశంలో సొంత క్రికెటర్లకు పూర్తి మద్దతు లభిస్తుందని, అలాంటి మద్దతు తమకు కావాలని చెప్పాడు. టెస్టు జట్టులో అంతా యువ ఆటగాళ్లు ఉండటం మేలు చేసిందన్నాడు. బౌలర్ల పైన నమ్మకం ఉంచడం అవసరమని, అందుకు ఈ సిరీస్ ఉదాహరణ అని చెప్పాడు.