మిథాలీ అంశంపై అతిగా చర్చిస్తున్నామని అనుకుంటున్నా: డయానా ఎడుల్జీ

హైదరాబాద్: వెస్టిండిస్ వేదికగా ఐసీసీ మహిళల వరల్డ్ టీ20లో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీపైనల్ తుది జట్టు నుంచి సీనియర్ బ్యాట్స్‌మన్ మిథాలీరాజ్‌ను తప్పించిన సంగతి తెలిసిందే. టోర్నీలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మిథాలీని సెమీఫైనల్ మ్యాచ్ నుంచి తప్పించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
మరోవైపు ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో మిథాలీ జట్టులో ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని అటు మాజీ క్రికెటర్లతో పాటు, ఇటు అభిమానులు సైతం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ పాలకుల కమిటీ(సీవోఏ) సభ్యురాలు, మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ స్పందించారు.

టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని ప్రశ్నించలేం
తుది జట్టు ఎంపికలో టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని ప్రశ్నించలేమని పేర్కొన్నారు. "ఈ అంశంపై అతిగా చర్చిస్తున్నామని అనుకుంటున్నా. విన్నింగ్ కాంబినేషన్ టీమ్‌ను మార్చకూడదని టీమ్ మేనేజ్‌మెంట్(కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, కోచ్ రమేశ్ పవార్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, సెలక్టర్ సుధా షా) నిర్ణయం తీసుకుంది" అని ఆమె అన్నారు.

జట్టు ఎంపికపై ఏ ఒక్కరు కూడా ప్రశ్నించరు
"అయితే, ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఒకవేళ ఇండియా గెలిస్తే.. జట్టు ఎంపికపై ఏ ఒక్కరు కూడా ప్రశ్నించరని నేను కచ్చితంగా చెప్పగలను" అని ఎడుల్జీ పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా ఆదివారం సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మూడో టీ20ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.

జట్టు ఎంపికలో ఎవరినీ నిందిచలేం
"పదకొండు మంది సభ్యుల ఎంపికలో ఎవరినీ నిందిచలేం. మీకొక ఉదాహరణ చెబుతా. ఆస్ట్రేలియాతో తొలి టీ20లో విఫలమైన స్పిన్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా, ఆదివారం జరిగిన మూడో టీ20లో తిరిగి పుంజుకొని సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందిందని గుర్తుచేశారు. భారత మహిళలకు అది దురదృష్టకరమైన రోజు" అని అన్నారు.

మిథాలీ వివాదంపై వివరణ కోరనున్న సీఓఏ
ఇదిలా ఉంటే, మిథాలీ రాజ్‌ను ఆడించకుండా తప్పించిన వివాదంపై వివరణ కోరాలని క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) నిర్ణయించింది. ఇందులో భాగంగా భారత మహిళల జట్టు స్వదేశం తిరిగొచ్చిన తర్వాత దీనికి సంబంధించి మిథాలీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, కోచ్ రమేశ్ పొవార్, మేనేజర్ తృప్తి, సెలక్టర్ సుధ షాలతో సీఓఏ బృందం విడివిడిగా మాట్లాడనుంది. మరోవైపు వరల్డ్ కప్‌లో మిథాలీని ఫిట్‌నెస్ ఎలా ఉందనే అంశంపై కూడా సీఓఏ వివరాలు కోరింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications