ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ టామ్ కరన్‌ను రాయల్ ఛాలెజంర్స్ బెంగళూరు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్లేయర్ కోసం ఆర్సీబీ రూ.1.50 కోట్లు వెచ్చించింది. అయితే టామ్ కరన్ నిషేధానికి గురయ్యాడు. అంపైర్‌ను బెదిరించిన నేరంలో వివాదాల్లో చిక్కుకున్నాడు. అసలేం జరిగిందంటే..
బిగ్ బాష్ లీగ్‌లో టామ్ కరన్ సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడుతున్నాడు. డిసెంబర్ 11న హోబర్ట్ హరికేన్స్- సిడ్నీ సిక్సర్ మ్యాచ్‌కు ముందు టామ్ కరన్ చేసిన పనికి 'క్రికెట్ ఆస్ట్రేలియా' అతడిపై వేటు వేసింది. ఆ మ్యాచ్ ప్రారంభానికి ముందు వార్మప్ టైమ్‌లో టామ్ కరన్ పిచ్‌పై కొంత భాగం పరిగెత్తాడు. అలా చేయొద్దని అక్కడ ఉన్న అంపైర్ సింబాలిక్‌గా సూచించాడు.

టామ్ కరన్ అంతటితో ఆగకుండా అంపైర్‌ను ఢీకొనేలా వేగంగా పరిగెత్తాడు. అంపైర్ పక్కకి తప్పించుకోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ ప్రవర్త నియమావళి ప్రకారం టామ్ కరన్ నేరానికి పాల్పడినట్టుగా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. నాలుగు మ్యాచ్‌ల పాటు నిషేధం విధించింది. అయితే ఈ తీర్పుపై సిడ్నీ సిక్సర్స్ అపీల్‌కు వెళ్లనుంది.
బిగ్ బాష్ లీగ్‌లో ప్రతి జట్టు 10 మ్యాచ్‌లు ఆడుతుంది. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన సిడ్నీ సిక్సర్స్ రెండింట్లోనూ గెలిచింది. టామ్ కరన్ నిషేధానికి గురి కావడంతో డిసెంబర్ 22న అడిలైడ్ స్ట్రైకర్స్, డిసెంబర్ 26న మెల్‌బోర్న్ స్టార్స్, డిసెంబర్ 30న సిడ్నీ థండర్స్, జనవరి 1న బ్రిస్బేన్ హీట్‌లతో జరిగే మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. కాగా, టామ్ కరన్ ఫామ్‌లో ఉన్నాడు. హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.