Tom Bruce:ఒక దేశంలో పుట్టి మరో దేశానికి సారథ్యం వహించిన క్రికెటర్లను చూశాం. ఇలా చాలామంది క్రికెటర్లు ఉన్నారు. వారి వ్యక్తిగత కారణాలతో అలా మరో దేశానికి ఆడారు. అయితే ఒక దేశం తరపున క్రికెట్ ఆడి ఆ దేశానికి గుడ్ బై చెప్పేసి మరో దేశానికి క్రికెట్ ఆడిన వారు చాలా తక్కువ మంది ఉంటారనే చెప్పాలి. అలాంటి ఓ క్రికెటర్ గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం.అతనే న్యూజిలాండ్ క్రికెటర్ టామ్ బ్రూస్.
టామ్ బ్రూస్ గురించి చెప్పాలంటే.. న్యూజిలాండ్ సూపర్ స్మాష్ టోర్నమెంట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.భారత్ లాంటి బలమైన జట్టుతో ఆడిన అనుభవం ఉంది. ఇప్పుడు ఆ అనుభవం మొత్తం స్కాట్లాండ్ జట్టుకు ఉపయోగపడనుంది. 34 ఏళ్ల బ్రూస్.. 2017-20 మధ్య న్యూజిలాండ్ తరఫున 17 టీ20లు ఆడాడు. బ్రూస్ తండ్రి స్కాట్లాండ్‌కు చెందిన వాడు.తన కోసమే ఇక పై స్కాట్లాండ్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈనెల 27 నుంచి కెనడా,నమీబియాతో జరిగే వన్డే వరల్డ్ కప్ లీగ్ 2 టోర్నమెంట్‌లో బ్రూస్..స్కాట్లాండ్ టీమ్‌తో చేరనున్నాడు. న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు ఆడకముందు టామ్ బ్రూస్ స్కాట్లాండ్ డెవలప్‌మెంట్ XI తరపున ఆడేవాడు.

టామ్ బ్రూస్ ఎవరు?
టామ్ బ్రూస్ క్రికెటర్‌గా అరంగేట్రం చేసే ముందు, 2015-16 సూపర్ స్మాష్ లీగ్‌లో 140 స్ట్రైక్ రేట్‌తో 223 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. బంగ్లాదేశ్‌తో 2017 జనవరిలో తన అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. రెండవ మ్యాచ్‌లోనే 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచి తన జట్టును గెలిపించాడు. అయితే, అతని కెరీర్‌లో నిలకడ లోపించింది. దీంతో 279 పరుగులు, రెండు హాఫ్ సెంచరీలతో కెరీర్ ముగిసింది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో టామ్ బ్రూస్.. రెండు డకౌట్లు నమోదు చేయడం అతని కెరీర్‌కు శాపంగా మారింది.
దేశవాళీ టోర్నీలో దుమ్మురేపిన బ్రూస్..
అయితే, తన అంతర్జాతీయ కెరీర్‌లో నిలకడ లోపించినా.. డొమెస్టిక్ మ్యాచ్‌ల్లో తనదైన శైలిలో రాణించాడు. గతేడాది సూపర్ స్మాష్ లీగ్‌లో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన బ్రూస్.. 157.67 స్ట్రైక్ రేట్‌తో 339 పరుగులు చేసి టాప్ 2లో నిలిచాడు. ఫోర్డ్ ట్రోఫీలో కూడా 431 పరుగులు చేశాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన బ్రూస్.. ఆక్లాండ్‌పై 345 పరుగులు చేసి న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు.
నాది స్కాటిష్ రక్తం
స్కాట్లాండ్ క్రికెట్ బోర్డుకు ఇచ్చిన ప్రకటనలో.. "నా కుటుంబంలో స్కాటిష్ చరిత్ర ఉంది. నేను స్కాట్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని నా కుటుంబ సభ్యులకు తెలుసు. ఐదేళ్ల క్రితం న్యూజిలాండ్‌కు ఆడే అవకాశం వచ్చింది. ఇప్పుడు నా నైపుణ్యాలను స్కాట్లాండ్ జట్టు తరపున ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాను. జట్టు విజయాలకు నా వంతు సహాయం అందిస్తాను. ఈ జట్టుకి విజయం సాధించగల సామర్థ్యం ఉందని నాకు తెలుసు మరింతగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను." అని బ్రూస్ అన్నాడు.
తాను 2016లో స్కాట్లాండ్ జట్టుతో కొద్ది రోజులు ఉన్నట్లు గుర్తు చేసుకున్న బ్రూస్... అది ఒక గొప్ప అనుభవగా పేర్కొన్నాడు.చాలా మంది స్కాట్లాండ్ ఆటగాళ్లతో కలిసి ఆడానని వెల్లడించిన బ్రూస్... వారితో మళ్లీ జట్టులో చేరడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.. స్కాట్లాండ్‌ను ప్రపంచ కప్‌కు చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాలనుకుంటున్నట్లు బ్రూస్ తెలిపాడు.