లండన్: ఇంగ్లాండ్ క్రికెట్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. వార్విక్ షైర్ మాజీ బౌలర్ టామ్ అలిన్(28) మృతి చెందాడు. ఇటీవలే ససెక్స్ ఆటగాడు మాథ్యూ హోబ్డెన్ మృతి ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే మరో యువ క్రికెటర్ ప్రాణాలు కోల్పోవడం ఇంగ్లీష్ క్రికెట్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది.
కాగా, బైడ్‌ఫోర్డ్ బ్రిడ్జి వద్ద టామ్ అలిన్ మృతదేహం సోమవారం లభ్యమైందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
టామ్ అలిన్ మరణవార్తను ధృవీకరిస్తూ వార్విక్‌షైర్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. తమ క్లబ్‌కు విశేష సేవలందించిన టామ్ అలిన్ మరణం తీరని లోటని పేర్కొంది. 'టామ్ మరణం క్లబ్‌లోని ప్రతి ఒక్కర్నీ కలచివేసింది. మా క్లబ్ లోఅతను ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లతో పాటు, దేశవాళీ వన్డేలు (లిస్ట్ ఏ తరపున) కూడా ఆడి మంచి క్రికెటర్ గా గుర్తింపు పొందాడు' అని వెల్లడించింది.

కాగా, 'కొన్ని పరిస్థితుల కారణంగా రెండు సంవత్సరాల క్రితం టామ్ క్లబ్‌ను వదిలేశాడు. నిజంగా అతని మరణంగా క్రికెట్‌కు లోటు' అని వార్విక్ షైర్ తెలిపింది.
మరోవైపు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు, పలువురు క్రికెటర్లు కూడా టామ్ మృతిపట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వార్విక్ షైర్‌కు ఆరు సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలందించిన టామ్ అలిన్.. 2013లో తన సొంత జట్టు డేవోన్‌కు తిరిగొచ్చేశాడు.