ముంబై: ఐపీఎల్ చరిత్రలో మరో అద్భుత ఫినిషింగ్. గుజరాత్ టైటాన్స్‌పై కోల్‌కత నైట్ రైడర్స్ సాధించిన విజయాన్ని ఇప్పట్లో ఎవరూ మరిచిపోలేరు. కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్.. ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. గుజరాత్ టైటాన్స్‌కు ఈ సీజన్‌లో తొలి అపజయాన్ని పరిచయం చేశాడు. యాష్ దయాళ్ వేసిన చివరి ఓవర్‌లో చివరి అయిదు బంతులను సిక్సర్లుగా మలిచాడు రింకూ సింగ్.
మరో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను మట్టి కరిపించింది. తొలుత బౌలింగ్‌లో ఆ తరువాత బ్యాటింగ్‌లో అదరగొట్టింది సన్‌రైజర్స్. తొలుత ఫీల్డింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్ కింగ్స్‌ను 143 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.

17.1 ఓవర్లల్లో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 145 పరుగులు చేసింది. రెండు వరుస ఓటముల తరువాత దక్కిన తొలి విజయం ఇది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. నిన్నటివరకు అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్ ఎనిమిదో స్థానానికి ఎగబాకింది. 14వ తేదీన తన తదుపరి మ్యాచ్‌ను ఆడనుంది సన్‌రైజర్స్. కోల్‌కత నైట్ రైడర్స్‌తో తలపడనుంది.
ఇవ్వాళ మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన మూడో మ్యాచ్ ఆడబోతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీ కొట్టనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ చేతిలో భంగపడిన విషయం తెలిసిందే.
ఈ పరాజయ భారాన్ని లక్నో సూపర్ జెయింట్స్‌పై తీర్చుకోవాలని భావిస్తోంది. ఇదే పిచ్‌పై ఆడిన ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది ఆర్సీబీ. కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ విశ్వరూపాన్ని చూపారా మ్యాచ్‌లో. 49 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు కోహ్లీ. మరోసారి అలాంటి ఇన్నింగ్‌ను ఆశిస్తోన్నారు బెంగళూరు ఫ్యాన్స్.

ఆల్ రౌండర్ వనిందు హసరంగ జట్టుకు అందుబాటులోకి రావడం రాయల్ ఛాలెంజర్స్‌కు బిగ్ బూస్ట్. లెగ్ స్పిన్ బౌలింగ్, భారీ హిట్టింగ్స్ చేయగల సామర్థ్యం ఉన్న హసరంగ మొన్నటి వరకు తన దేశం తరఫున ఇంటర్నేషనల్ మ్యాచ్‌లను ఆడాడు. ఇప్పుడా సిరీస్ ముగియడంతో ఆర్సీబీకి అందుబాటులోకి వచ్చాడు. ఇవ్వాళ్టి మ్యాచ్ కోసం అతణ్ని తుదిజట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఆర్సీబీ తుదిజట్టులో- విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), సుయాష్ ప్రభుదేశాయ్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగా/మైఖెల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్‌లో- కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైలే మేయర్స్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, రొమారియో షెపర్డ్/మార్క్ వుడ్, యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్, జయదేవ్ ఉనద్కత్ ఆడొచ్చు.