చెన్నై: ఐపీఎల్ 2023లో మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్. ఇవ్వాళ చెన్నై సూపర్ కింగ్స్- ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు తొలి రౌండ్‌లో పోటీ పడ్డాయి. ఇప్పుడు రివర్స్ రౌండ్‌లో మళ్లీ ఎదురుపడ్డాయి.
ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ సారథ్యాన్ని వహిస్తోన్న ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్ ఢీ కొట్టబోతోన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వర్షం వల్ల లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌ను పక్కనపెడిత ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లల్లో అయిదు విజయాలను సాధించింది. మొత్తం 11 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.

ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లను ఆడిన ముంబై ఇండియన్స్ కూడా అయిదు విజయాలను సాధించింది. 10 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో ఈ జట్టు స్థానం.. 6. ఫస్ట్ రౌండ్‌లో చెన్నై చేతిలో మట్టికరిచింది రోహిత్ సేన. ఇప్పుడు దానికి ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. ప్లేఆఫ్స్ సమీపిస్తోన్న పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిన అవసరం కూడా ఉంది.
ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ కొన్ని మార్పులు చేయనుంది. అంబటి రాయుడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిస్తుందనే అంచనాలు ఉన్నాయి. సీఎస్‌కే మొదట బ్యాటింగ్ చేస్తే తుదిజట్టులో అంబటి రాయుడు ఉంటాడు. బౌలింగ్ సమయంలో ఇంప్లాక్ట్ ప్లేయర్‌గా రాయుడికి బదులు తుషార్ దేశ్‌పాండేను తీసుకోవాలని భావిస్తోంది. మొదట బౌలింగ్ చేసినా తుషార్ దేశ్‌పాండేను తుదిజట్టులోకి తీసుకుంటుంది.
రెండో ఇన్నింగ్‌లో అతనికి బదులుగా అంబటిని ఆడించవచ్చు. చెపాక్ పిచ్ స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని ముంబై ఇండియన్స్ జట్టులో కూడా మార్పులు చేయనుంది. డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోవచ్చు. ఎక్స్‌ట్రా బౌలర్‌ను ఆడించే ఉద్దేశంతో సూర్యకుమార్‌ను కుమార్ కార్తికేయతో రీప్లేస్ చేసే అవకాశం ఉంది.
సీఎస్‌కే తుదిజట్టులో- డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, శివమ్ దూబే, అంబటి రాయుడు, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్ వికెట్ కీపర్), దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, మథీషా పాథిరన, ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుషార్ దేశపాండే ఆడొచ్చు. ఇక్కడ అంబటి రాయుడు, తుషార్ దేశ్‌పాండే ఇంపాక్ట్ ప్లేయర్లుగా పరస్పరం రీప్లేస్ అయ్యే అవకాశం ఉంది.
ముంబై ఇండియన్స్‌లో- రోహిత్ శర్మ (కేప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహల్ వధేరా, పీయూష్ చావ్లా, జోఫ్రా అర్చర్, హృతిక్ షోకీన్, ఆకాశ్ మధ్వల్/అర్షద్ ఖాన్‌ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్‌గా కుమార్ కార్తికేయను ఆడించవచ్చు. సూర్యకుమార్ యాదవ్‌తో రీప్లేస్ చేయొచ్చు.