
36 పరుగులకే ఆలౌట్
గత ఏడాది ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా 4 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడింది. ఆడిలైడ్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ డే అండ్ నైట్ మ్యాచ్‌గా జరిగింది. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా అతిథ్య ఆస్ట్రేలియాపై 53 పరుగుల అధిక్యం కూడా సంపాదించింది. అయితే ఎవరూ ఊహించని రీతిలో సెకండ్ ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే ఆలౌటైంది. భారత జట్టులో ఒక్క బ్యాటర్ కూడా రెండంకేలా స్కోర్ చేయలేకపోయాడు. దీంతో ఆ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. రోహిత్ శర్మ ఇంకా టీంలో చేరలేదు. దీంతో టీమిండియా బలహీనంగా కనిపించింది. ఇదే అదునుగా ఆస్ట్రేలియా మాజీలు తమ నోటికి పని చెప్పారు. టీమిండియాను తక్కువ చేస్తూ అవమానకర వ్యాఖ్యలు చేశారు. టీమిండియా సిరీస్‌లో కనీస పోటీ కూడా ఇవ్వలేదని, 0-4 తేడాతో వైట్‌వాష్ తప్పదని హెచ్చరించారు.

అద్భుతంగా పుంజుకున్న టీమిండియా
తొలి టెస్టులో ఎదురైన ఘోర పరాజయాన్ని పక్కన పెట్టి మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. తొలుత బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆలౌట్ చేసింది. బుమ్రా 4, అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా ఒక వికెట్ తీశారు. అనంతరం కెప్టెన్ అజింక్యా రహానే సెంచరీకి తోడు రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 326 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాపై 131 పరుగుల భారీ అధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ సమిష్టి ప్రదర్శనతో చెలరేగిన భారత బౌలర్లు ఆస్ట్రేలియాను 200 పరుగులకే ఆలౌట్ చేశారు. సిరాజ్ 3, బుమ్రా, అశ్విన్, జడేజా రెండేసి, ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశారు. అనంతరం 70 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయసంగా చేధించింది. ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లతోపాటు మాజీలు కూడా షాక్‌కు గురికాక తప్పలేదు. తొలి టెస్ట్ మ్యాచ్‌లో 36 పరుగులకే ఆలౌటైన జట్టనే ఇది అని ముక్కున వేలు వేసుకున్నారు. టీమిండియా పుంజుకున్న తీరును ప్రతి ఒక్కరూ ప్రశసించారు. అంతేకాకుండా 0-4 తేడాతో వైట్ వాష్ అవుతుందని టీమిండియాను విమర్శించిన ఆస్ట్రేలియా మాజీల నోళ్లకు తాళాలు పడ్డాయి. టీమిండియా పుంజుకున్న విధానాన్ని చూసి వారికి ప్రశసించక తప్ప లేదు. 2020 డిసెంబర్ 29న ఈ అద్భుతం చోటు చేసుకుంది. దీంతో నేటికి సరిగ్గా ఏడాది పూర్తైన సందర్భంగా అభిమానులు ఆ మ్యాచ్‌ను ఒక సారి గుర్తు చేసుకుంటున్నారు.

సిరీస్ కూడా మనదే
రెండో టెస్ట్ మ్యాచ్‌లోనే కాదు తర్వాతి టెస్టు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా అదే జోరును చూపించింది. మూడో టెస్ట్‌లో విజయం ఖాయమనుకున్న ఆస్ట్రేలియా ఆశలపై నీళ్లు చల్లి హనుమ విహారీ, రవిచంద్రన్ అశ్విన్ అద్భుత ఆట తీరుతో టెస్టు మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. ఇక సిరీస్ విజేతను తేల్చే నాలుగో టెస్టు మ్యాచ్‌లో అయితే టీమిండియా అద్బుతమే చేసింది. రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ అద్భుత ఆటతీరుతో 329 భారీ లక్ష్యాన్ని భారత జట్టు చివరి రోజు చేధించింది. ఈ చేధనతో మ్యాచ్‌తోపాటు ఏకంగా సిరీస్‌ను కూడా రహానే సేన 2-1 తేడాతో కైవసం చేసుకుని ఆస్ట్రేలియాను సొంత గడ్డపైనే కోలుకోలేని దెబ్బ కొట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులతోపాటు మాజీ ఆటగాళ్లు భారత జట్టుపై ప్రశంసలు కురిపించారు. కాగా అంతకుముందు ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు కూడా టెస్ట్ సిరీస్‌ను టీమిండియానే గెలుచుకుంది.


Click it and Unblock the Notifications
