భారత్ మరో సమరానికి సిద్ధమైంది. జనవరి 11 నుంచి స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ ముందు భారత్ తలపడే ఆఖరి టీ20 సిరీస్ ఇదే. అయితే అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్ ముగిసిన అనంతరం స్వదేశంలో ఇంగ్లాండ్‌తో భారత్ అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. టెస్టు ఛాంపియన్ షిప్‌లో టాప్-2లో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే టీమిండియాకు ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్ ఎంతో కీలకం.
అయితే భారత్ పర్యటనకు వస్తున్న ఇంగ్లాండ్‌కు ఆ జట్టు మాజీ స్పిన్నర్ పనేసర్ కొన్ని కీలక సూచనలు చేశాడు. భారత్‌లోని టర్నింగ్ పిచ్‌లపై టీమిండియా బ్యాటర్లు స్పిన్‌లో ప్రతిదాడికి దిగడానికి ప్రయత్నిస్తారని, రోహిత్ శర్మను వీలైనంత తొందరగా ఔట్ చేయాలని పనేసర్ అన్నాడు. అలాగే తన దృష్టిలో రవిచంద్రన్ అశ్విన్ మిస్టరీ స్పిన్నర్‌గా కొనియాడాడు.

''టర్న్ అవుతున్న బంతుల్ని భారత్ బ్యాటర్లు దూకుడుగా ఎదుర్కొంటారు. నిర్భయంగా ఆడతారు. టీమిండియాలో కీలక ప్లేయర్ రోహిత్ శర్మ. టర్నింగ్ పిచ్‌లపై అతడు దిగ్గజ డాన్ బ్రాడ్‌మన్ వంటి ఆటగాడు. రోహిత్ రికార్డులు నమ్మశక్యంగా ఉండవు. రోహిత్‌ను త్వరగా ఔట్ చేస్తేనే ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ విజయం సాధించగలదు. రోహిత్‌ను తొందరగా ఔటైతే.. టీమిండియా ప్లాన్-Bకి వెళ్తుంది. ఆ సమయంలో యువ ఆటగాళ్లపై ఒత్తిడి తీసుకురావచ్చు. ఇది టెస్టు సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషిస్తుంది''
'' అశ్విన్ విభిన్న బంతుల్ని సంధించేలా సిద్ధంగా ఉంటాడు. అతడు బౌలింగ్‌లో అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు. టర్నింగ్ పిచ్‌పై వికెట్లు సాధించడం అన్ని వేళల్లో అంత ఈజీ కాదు. కానీ అశ్విన్ పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోతూ సత్తాచాటుతుంటాడు. అశ్విన్ ఒక యాప్ లాంటి వాడు. ప్రతి ఆరు నెలలకు అప్‌డేట్ అవుతూనే ఉన్నాడు. అందుకే అతడు తన కెరీర్‌లో రాణిస్తున్నాడు''
''అశ్విన్ బౌలింగ్ విషయంలో నేను ఓ విద్యార్థి. అతడి బౌలింగ్‌లో కొత్త విషయాన్ని తెలుసుకుంటూనే ఉన్నాను. అదే అతడి బలం. అతడు ఓ అద్భుతమైన బౌలర్'' అని పనేసర్ అన్నాడు. కాగా, జనవరి 25 నుంచి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు ఉప్పల్‌లో జరగనుంది.