క్రికెట్‌లో సూపర్ క్యాచులు చూస్తూనే ఉంటాం. ఫార్మాట్ ఏదైనా చురుగ్గా కదిలే ఫీల్డర్లు ఎప్పటికప్పుడు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తూనే ఉంటారు. తాజాగా తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అలాంటి ఘటనే జరిగింది. ఇటీవల టీమిండియా వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన పనితో ప్రపంచ వ్యాప్తంగా ఈ లీగ్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఘటన అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఈ లీగ్‌లో భాగంగా దిండిగుల్ డ్రాగన్స్, సీచెమ్ మదురై పాంథర్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. డ్రాగన్స్ బ్యాటింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ జట్టుకు ఓపెనర్ ఎస్ అరుణ్ అద్భుతమైన ఆరంభం అందించాడు. అతనితోపాటు క్రీజులో ఉన్న మరో ఓపెనర్ కూడా అదరగొట్టాడు. దీంతో ఆ జట్టు కేవలం 3.2 ఓవర్లలోనే 32 పరుగులు చేసింది. ఆ మరుసటి బంతికి అరుణ్ మరో భారీ షాట్ ఆడబోయాడు.

ఈ క్రమంలో బంతి బాగా గాల్లోకి లేచి ఆఫ్‌సైడ్ వెళ్లింది. అది కచ్చితంగా బౌండరీ వెళ్తుందని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ పాంథర్స్ ఫీల్డర్ మురుగన్ అశ్విన్ మాత్రం దీనికి ఒప్పుకోలేదు. థర్టీ యార్డ్ సర్కిల్‌లో నుంచి వేగంగా పరుగెత్తిన అతను.. ముందుకు దూకి గాల్లో ఉండగానే బంతిని అందుకున్నాడు. అతను అందుకున్న ఈ స్టన్నింగ్ క్యాచ్ చూసి అంతా షాకయ్యారు.
బ్యాటర్ ఎస్ అరుణ్ కూడా దిగ్భ్రాంతి చెందాడు. కానీ చేసేదేం లేక నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా ధనాధన్ ఆట ఆడటంతో ఈ మ్యాచ్‌లో డ్రాగన్స్ జట్టు సులభంగా విజయం సాధించింది. మరో 35 బంతులు మిగిలుండగానే ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. కానీ మురుగన్ అశ్విన్ అందుకున్న క్యాచ్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అతనిది క్యాచ్ ఆఫ్ ది సీజన్ అని మెచ్చుకుంటున్నారు.