
భారత్ నుంచి ఆ ఇద్దరే..
టీమిండియా సెమీఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు రేసులో నిలిచారు. ఈ టోర్నీలో ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ వాటిలో నాలుగు సార్లు అర్ధశతకాలు సాధించి, టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో సూర్యకుమార్ మూడో స్థానంలో ఉన్నాడు. అయితే పాకిస్తాన్‌పై అత్యుత్తమ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్నందించిన విరాట్ కోహ్లీకి ఈ అవార్డు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా, ఇప్పటికే కోహ్లీ రెండు సార్లు పొట్టి ప్రపంచకప్పుల్లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన సంగతి తెలిసిందే.

పాక్ నుంచి కూడా ఇద్దరు..
ఎవరూ ఊహించని విధంగా సెమీఫైనల్ చేరిన పాకిస్తాన్ జట్టు.. అద్భుత ఫామ్‌లో ఉన్న న్యూజిల్యాండ్‌ను ఓడించి ఫైనల్ చేరింది. ఈ టోర్నీలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన పాకిస్తాన్‌లో నిలకడగా రాణించిన ఆటగాడు షాదాబ్ ఖాన్. అలాగే తొలి రెండు మ్యాచుల్లో సత్తా చాటకపోయినా.. ఆ తర్వాత పుంజుకొని అదరగొడుతున్నాడు పేసర్ షహీన్ అఫ్రిదీ. వీళ్లిద్దరూ కూడా 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' రేసులో ఉన్నారు.

ఇంగ్లండ్ నుంచి ఏకంగా ముగ్గురు..
సెమీఫైనల్‌లో భారత్‌ను చిత్తుచేసి ఫైనల్ చేరిన ఇంగ్లండ్ జట్టు నుంచి ఈ అవార్డు కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. భారత్‌పై అదరగొట్టిన ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ ఇద్దరూ ఈ రేసులో ఉన్నారు. వీరితోపాటు బంతితో ఆ జట్టుకు అద్భుతమైన విజయాలు అందించిన శామ్ కర్రాన్ కూడా 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు కోసం పోటీ పడుతున్నాడు.

మరో ఇద్దరు ఎవరంటే..
ఈ బడా ఆటగాళ్లతో పాటు జింబాబ్వే వెన్నెముక సికందర్ రజా కూడా 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' కోసం పోటీలో ఉన్నాడు. ఈ టోర్నీలో 219 పరుగులు చేసిన అతను.. పది వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే టోర్నమెంట్‌లో టాప్ వికెట్ టేకర్‌గా ఉన్న శ్రీలంక స్పిన్ మాంత్రికుడు వానిందు హసరంగ కూడా ఈ రేసులో ఉన్నాడు.


Click it and Unblock the Notifications












