
సిడ్నీ: భారత్‌తో ముగిసిన ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో న్యూజిలాండ్ విజేతగా నిలవడంతో ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ కివీస్ దేశస్థులకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుకు ముందు పైన్ ఓ మీడియాతో మాట్లాడుతూ.. భారత జట్టే విజేతగా నిలుస్తుందని అంచనా వేశాడు. దాంతో పైన్ కివీస్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇక ఫైనల్‌లో న్యూజిలాండ్ తొలి టెస్టు ఛాంపియన్‌గా నిలవడంతో ఆ దేశానికి చెందిన ఓ రేడియో కార్యక్రమంలో ఆసీస్ కెప్టెన్ మాట్లాడాడు. ఈ సందర్భంగా కివీస్ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు.
'అందరూ కొన్నికొన్ని సందర్భాల్లో తప్పుడు అంచనాలు వేస్తారు. నేను కూడా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్ గెలుస్తుందని అంచనా వేశా. న్యూజిలాండ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాను. ఇప్పుడా జట్టు విజయం సాధించిన నేపథ్యంలో ఆ దేశ అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెబుతున్నాను. ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ అత్యద్భుతంగా ఆడింది. విలియమ్సన్ సేన విజయం కోసం ఆరాటపడే విధానం చూసేందుకు అద్భుతంగా ఉంటుంది. నేను తస్మానియా నుంచి వచ్చాను. అది ఆస్ట్రేలియాలోనే చాలా చిన్న రాష్ట్రం. అయినా మేం మా కన్నా బలంగా ఉన్న వారిని ఢీకొడతాం. కాబట్టి అంతర్జాతీయ వేదికపై న్యూజిలాండ్ సత్తా చాటినప్పడు, దాన్ని నేను కచ్చితంగా గౌరవిస్తా' అని పైన్ అన్నాడు.
తుదిపోరుకు ముందు టిమ్ పైన్ మాట్లాడుతూ... 'నా అంచనా ప్రకారం టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియానే విజేతగా నిలుస్తుంది. అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగితే కోహ్లీసేన విజేతగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అందరూ బాగా ఆడితే చాలు. కివీస్ కూడా పటిష్టంగానే ఉంది. ఇంగ్లండ్ జట్టును దాని సొంతగడ్డపై ఓడించింది. ఇంగ్లీష్ జట్టులో చాలా మంది స్టార్ ప్లేయర్స్ తుది జట్టులో ఆడలేదు' అని అన్నాడు. డబ్ల్యూటీసీలో ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
బుధవారం ముగిసిన ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని కేన్ సేన 2 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ 249 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 170 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 139 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.