వెల్లింగ్టన్ వేదికగా పరుగుల వరద పారిన తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టిమ్ డేవిడ్ (31*; 10 బంతుల్లో) విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆసీస్ ఆఖరి బంతికి గెలిచింది. నరాలు తెగే ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 215 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (68; 35 బంతుల్లో), కాన్వే (63; 46 బంతుల్లో) అర్ధశతకాలతో సత్తాచాటారు.
ఆది నుంచే న్యూజిలాండ్ దూకుడుగా ఆడింది. ఓపెనర్లు ఫిన్ అలెన్ (32; 17 బంతుల్లో), కాన్వే తొలి వికెట్‌కు 32 బంతుల్లో 61 పరుగులు చేశారు. అలెన్‌ను స్టార్క్ ఔట్ చేయడంతో వీరిద్దరి భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రచిన్.. కాన్వేతో కలిసి స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. అయితే రచిన్ తొలుత నిదానంగా ఆడాడు. 14 బంతుల్లో 16 పరుగులే చేసిన రచిన్ ఆ తర్వాత ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తాను ఎదుర్కొన్న చివరి 19 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (19; 10 బంతుల్లో), చాప్‌మన్ (18; 13 బంతుల్లో) పరుగులు చేశారు.

అనంతరం ఛేదనకు వచ్చిన ఆస్ట్రేలియా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. ట్రేవిస్ హెడ్ (24; 15 బంతుల్లో)ను నాలుగో ఓవర్‌లో మిల్నీ బోల్తాకొట్టించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మిచెల్ మార్ష్ (72*; 44 బంతుల్లో) ఆఖరి వరకు క్రీజులో నిలిచాడు. కీలక భాగస్వామ్యాలను నెలకొల్పుతూ కొండతం లక్ష్యాన్ని కరిగించాడు. అతడికి తోడుగా డేవిడ్ వార్నర్ (32; 20 బంతుల్లో), గ్లెన్ మాక్స్‌వెల్ (25; 11 బంతుల్లో), జోస్ ఇంగ్లిస్ (20; 20 బంతుల్లో) బ్యాటును ఝుళిపించారు.
అయితే ఆసీస్ విజయానికి ఆఖరి రెండు ఓవర్లలో 35 పరుగులు అవసరమయ్యాయి. అప్పుడే టిమ్ డేవిడ్ తన ఊచకోత మొదలుపెట్టాడు. మిల్నీ వేసిన 19వ ఓవర్‌లో వరుసగా ఫోర్, రెండు సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్‌లో 19 పరుగులు వచ్చాయి. దీంతో గెలుపు సమీకరణం చివరి ఆరు బంతుల్లో 16 పరుగులుగా మారింది. సౌథి తొలి మూడు బంతుల్లో 4 పరుగులే ఇచ్చాడు. కానీ డేవిడ్ నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచాడు. అయిదో బంతికి ఎక్సట్రా కవర్ మీదుగా రెండు పరుగులు తీశాడు. ఇక ఆఖరి బంతికి నాలుగు పరుగులు అవసరమవ్వగా కౌ కార్నర్ మీదగా బౌండరీ సాధించి జట్టును గెలిపించాడు.