రంజీ ట్రోఫీలో యువ సంచలనం తిలక్ వర్మ అదరగొడుతున్నాడు. ఫామ్‌ను కొనసాగిస్తూ సిక్కిం జట్టుపై అజేయ శతకం సాధించాడు. 111 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఎనిమిది బౌండరీలు, నాలుగు సిక్సర్లు బాదాడు. తిలక్ వర్మతో పాటు ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (137; 125 బంతుల్లో) కూడా సెంచరీతో సత్తాచాటాడు. రాహుల్ సింగ్(83; 64 బంతుల్లో ), రోహిత్ రాయుడు (75; 111 బంతుల్లో), చందన్ (54; 56 బంతుల్లో) కూడా రాణించడంతో 463/4 భారీ స్కోరు వద్ద హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
హైదరాబాద్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా, సిక్కిం బౌలర్లలో అంకుర్ మాలిక్ రెండు వికెట్లు, సుమిత్ సింగ్, లీ యంగ్ లెప్చా చెరో వికెట్ తీసారు. అంతకుముందు సిక్కిం తొలి ఇన్నింగ్స్‌లో 79 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. త్యాగరాజన్ ఆరు వికెట్లు, మిలింద్ నాలుగు వికెట్లు తీశారు. అయితే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సిక్కిం.. టీ విరామానికి ఆరు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లు ధాటికి 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన నిలేశ్ (28), సుమిత్ సింగ్ (34) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ హైదరాబాద్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. ప్రస్తుతం క్రీజులో పాల్జొర్ తమాంగ్ (29), అంకుర్ మాలిక్ (34) ఉన్నారు. సాయిరామ్, కార్తికేయ, త్యాగరాజన్ తలో మూడు వికెట్లతో సత్తాచాటారు. కాగా, సిక్కం ఇంకా 223 పరుగుల వెనకంజలో ఉంది. హైదరాబాద్ విజయానికి మరో నాలుగు వికెట్ల దూరంలో ఉంది.
అయితే తిలక్ వర్మకు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. ఇంగ్లాండ్ లయన్స్‌తో రెండు,మూడు టెస్టులకు భారత్-ఎ జట్టుకు తిలక్ వర్మ ఎంపికయ్యాడు. తిలక్‌తో పాటు రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్ కూడా సెలక్ట్ అయ్యారు. అహ్మదాబాద్ వేదికగా జనవరి 24 నుంచి రెండో టెస్టు, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్, మిజోరంతో జరగనున్న మ్యాచ్‌లకు తిలక్ వర్మ దూరం కానున్నాడు.
ప్లేట్ గ్రూప్‌లో భాగంగా నాగాలాండ్, మేఘూలయతో జరిగిన మ్యాచ్‌ల్లో హైదరాబాద్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నాగాలాండ్‌పై ఇన్నింగ్స్ 194 పరుగులు, మేఘూలయపై ఇన్నింగ్స్ 81 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ విజయాల్లో కెప్టెన్, బ్యాటర్‌గా తిలక్ వర్మ కీలకపాత్ర పోషించాడు.
రెండో అనధికార టెస్టుకు 'భారత్ -ఎ' జట్టు : అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, విద్వాత్ కావరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాల్
మూడో అనధికార టెస్టుకు 'భారత్- ఎ' జట్టు : అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, తిలక్ వర్మ, రింకూ సింగ్, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, షామ్స్ ములానీ, అర్ష్‌దీప్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, విద్వాత్ కావరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాల్