అందువల్లే గెలిచాం.. అసలు సీక్రెట్ అదే: తిలక్ వర్మ
ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో శ్రీలంక ఏ జట్టుపై ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకున్న అనంతరం భారత కెప్టెన్ తిలక్ వర్మ జట్టు ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. ప్రజెంటేషన్ వేడుకలో మాట్లాడిన తిలక్ వర్మ.. టోర్నీలో తమ ప్రయాణం అంత సులభంగా సాగలేదని గుర్తు చేసుకున్నాడు. ముఖ్యంగా గ్రూప్ దశలో ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక చేతుల్లో వరుసగా ఓడిపోయిన తర్వాత జట్టులోని ఆటగాళ్లంతా అద్భుతంగా రాణించారని చెప్పుకొచ్చాడు. ఆ పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుని భారీ తేడాతో మ్యాచ్‌లు గెలిచి ఫైనల్ చేరడం నిజంగా అద్భుతమని కొనియాడాడు.
సక్సెస్ సీక్రెట్ అదే..
ఈ టోర్నీలో భారత్ అదరగొట్టడానికి గల సీక్రెట్ ఏంటని ప్రశ్నించగా.. తిలక్ వర్మ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. "మా జట్టులోని ఆటగాళ్లందరికీ దేశవాళీ క్రికెట్ ఆడిన మంచి అనుభవం ఉంది. మ్యాచ్‌కు ముందే మేము పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగాం. పవర్‌ప్లేలో ఎలా ఆడాలి..10 నుంచి 40 ఓవర్ల మధ్య ఇన్నింగ్స్ ను ఎలా నిర్మించాలి, ఆ తర్వాత స్కోరును ఎలా వేగవంతం చేయాలనే దానిపై స్పష్టత ఉంది. డెత్ ఓవర్లలో మాకు మంచి హిట్టర్లు ఉన్నారనే నమ్మకం మాకు ఉంది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్య ఇచ్చిన అద్భుతమైన ఆరంభం తర్వాత.. మిడిల్ ఓవర్లలో భాగస్వామ్యాలు నెలకొల్పడమే మా వ్యూహం. అదే ఈ రోజు వర్కవుట్ అయింది" అని కెప్టెన్ తిలక్ వర్మ వివరించాడు.

బౌలింగ్‌పై తిలక్ వర్మ అసంతృప్తి
ఈ సిరీస్ ద్వారా జట్టుగా ఏం నేర్చుకున్నారనే విషయంపై తిలక్ వర్మ కాస్త నిజాయితీగా స్పందించాడు. బ్యాటింగ్ విభాగం అంచనాలకు తగ్గట్టుగా రాణించినప్పటికీ.. బౌలింగ్ ప్రదర్శనపై తిలక్ వర్మ కొంత నిరాశను వ్యక్తం చేశాడు. "నిజం చెప్పాలంటే మాకు మంచి బౌలింగ్ అటాక్ ఉంది. కానీ ఈ టోర్నీలో మా బౌలింగ్ అనుకున్నంత స్థాయిలో లేదు. ఇలాంటి వన్-ఆఫ్ సిరీస్‌లలో కొన్నిసార్లు అలా జరుగుతుంటుంది. అందరికీ మంచి ప్రతిభ ఉంది కాబట్టి చివరికి ఫలితం మనకు అనుకూలంగా రావడం సంతోషమే. అయితే మేము గెలిచినా కూడా బౌలింగ్ విభాగంలో ఇంకా మెరుగుపరుచుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది" అంటూ తిలక్ వర్మ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications