రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్‌లో నాగాలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్స్‌లో హైదరాబాద్ ఆధిపత్యం చెలాయిస్తోంది. ట్రిపుల్ సెంచరీ హీరో తన్మయ్ అగర్వాల్ (164; 192 బంతుల్లో 12×4, 3×6), యువ కెరటం తిలక్ వర్మ (101; 135 బంతుల్లో 6×4, 5×6) మరోసారి శతకాల మోత మోగించారు. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసేసరికి హైదరాబాద్ అయిదు వికెట్లు కోల్పోయి 383 పరుగులు చేసింది.
అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రాహుల్ సింగ్ (5; 6 బంతుల్లో 1×4) నాలుగో ఓవర్‌లోనే ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రోహిత్ రాయుడు (59; 107 బంతుల్లో 3×4, 3×6)తో కలిసి తన్మయ్ అగర్వాల్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అనంతరం క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మతో కలిసి తన్మయ్ మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పి హైదరాబాద్‌ను పటిష్టస్థితిలో నిలిపాడు. వీరిద్దరు దూకుడుగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మూడో వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరు పెవిలియన్‌కు చేరారు. క్రీజులో నితీశ్ రెడ్డి (21*; 55 బంతుల్లో), ప్రజ్ఞయ్ రెడ్డి (12; 23 బంతుల్లో) ఉన్నారు.
మరోవైపు ఎలీట్ గ్రూప్-బి మ్యాచ్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. అయితే ఆంధ్రకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు మహీప్ కుమార్, ప్రశాంత్ కుమార్ (14) విఫలమయ్యారు. దీంతో 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. హనుమ విహారి (11) కూడా నిరాశపరిచాడు.
వన్‌డౌన్‌లో వచ్చిన శశికాంత్ (72; 83, బంతుల్లో 9×4, 2×6), కెప్టెన్ రికీ భుయ్ (90*; 171 బంతుల్లో 9×4, 1×6)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. శశికాంత్ ఔటైనా కరణ్ షిండే (45*; 135 బంతుల్లో 5×4, 1×6)తో కలిసి రికీ భుయ్ స్కోరుబోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. వీరిద్దరు అయిదో వికెట్‌కు అజేయం శతక భాగస్వామ్యాన్ని నమోదుచేశారు.