
పవర్ ప్లే బ్యాటింగ్
ప్రపంచకప్ నాకౌట్ మ్యాచుల్లో పవర్ ప్లే బ్యాటింగ్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసి వచ్చింది. మొదటి సెమీఫైనల్‌లో కివీస్ జట్టు తొలి ఆరు ఓవర్లలో 38/2 స్కోరుతో నిలిచింది. బదులుగా పాక్ ఓపెనర్లు చెలరేగడంతో పవర్‌ప్లే ముగిసే సరికి 55/0తో నిలిచిందా జట్టు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించింది. భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ కూడా అచ్చం అలాగే సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ పవర్ ప్లేలో 38/1 స్కోరు చేయగా.. ఇంగ్లండ్ ఓపెనర్లు చెలరేగి పవర్‌ప్లేను 63/0తో ముగించారు. ఆ తర్వాత భారత్‌ను పది వికెట్ల తేడాతో చిత్తు చేశారు.

స్పిన్నర్లు..
ఆస్ట్రేలియా పిచ్‌లు స్పిన్నర్లకు పెద్దగా సహకరించడం లేదు. కానీ క్వాలిటీ స్పిన్నర్లు ఏదో రకంగా వికెట్లు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. వారిలో పాకిస్తాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ కూడా ఒకడు. జట్టుకు అత్యవసరం అయినప్పుడు కీలక వికెట్లు తీస్తూ బ్రేక్ ఇస్తున్నాడీ స్టార్ ఆల్‌రౌండర్. ఇంగ్లండ్ జట్టులో అదిల్ రషీద్ ప్రధాన స్పిన్నర్. తొలి రెండు మ్యాచుల్లో వికెట్లేమీ తీసుకోని అతను.. శ్రీలంక, భారత్‌తో జరిగిన మ్యాచుల్లో ఒక్కో వికెట్ తీసుకున్నాడు. చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ప్రధాన బ్యాటర్లను బుట్టలో వేసుకుంటున్నాడు.

ఐదో బౌలర్ కోటా..
టీ20 ఫార్మాట్‌లో ఐదో బౌలర్ కోటా కీలకంగా మారింది. ఈ ఫార్మాట్‌లో అదనంగా ఇచ్చే 10-15 పరుగులే విజేతను నిర్ణయిస్తాయి. అందుకే ఐదో బౌలర్ కోటా కీలకంగా మారింది. పాకిస్తాన్ జట్టులో ఈ కోటాను మహమ్మద్ నవాజ్ జూనియర్, మహమ్మద్ వాసిం కలిసి పూర్తి చేస్తున్నారు. వీళ్లు కూడా బాగానే బౌలింగ్ చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంగ్లండ్ వద్ద బెన్ స్టోక్స్, మొయీన్ అలీ, లివింగ్‌స్టోన్ రూపంలో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అయితే బట్లర్ మాత్రం ఎక్కువగా స్టోక్స్ మీదనే ఆధార పడుతున్నాడు. మొయీన్ అలీకి దాదాపుగా బౌలింగ్ ఇవ్వని బట్లర్.. మరి లివింగ్‌స్టోన్‌పై ఆధార పడతాడేమో చూడాలి. వీళ్లు పరుగులు కట్టడి చేసినా, కీలకమైన వికెట్లు తీసినా అదే మ్యాచ్‌ను మలుపు తిప్పే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












