
ఇషాన్ కిషన్
భారత్, న్యూజిల్యాండ్ మధ్య జరిగిన రెండో టీ20లో కూడా కిషన్ పెద్దగా రాణించలేదు. 30 బంతుల్లో 36 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. దీంతో మూడో టీ20లో కూడా అతన్నే కొనసాగించాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఈ నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేసిన అతను చాలా ఛండాలంగా ఆడాడు. రెండో టీ20లోనే అతని స్ట్రైక్ రేట్ చాలా ఘోరంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి.
మూడో టీ20లో కూడా పెద్దగా రాణించని అతను 11 బంతుల్లో 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. పేసర్ ఆడమ్ మిల్నే వేసిన షార్ట్ బాల్‌ను సరిగా ఆడలేకపోయిన అతను.. మార్క్ చాప్‌మాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ సిరీస్‌లో కిషన్ ప్రదర్శన చూసిన తర్వాత.. శుభ్‌మన్ గిల్ వంటి ఫామ్‌లో ఉన్న ఆటగాడిని కాదని మళ్లీ కిషన్‌కు అవకాశం ఇస్తే కచ్చితంగా విమర్శలపాలవడం ఖాయం.

శ్రేయాస్ అయ్యర్
ఒకానొక సమయంలో టీమిండియా భవిష్యత్తు కెప్టెన్‌గా మన్ననలు పొందిన శ్రేయాస్ అయ్యర్.. ఆ తర్వాత తనలోని డొల్లతనాన్ని బహిర్గతం చేసుకున్నాడు. షార్ట్ బాల్స్‌కు తడబడే అయ్యర్.. కివీస్‌తో జరిగిన మూడో టీ20లో అలాంటి డెలివరీకే చేతులెత్తేశాడు. రెండో టీ20లో హిట్‌వికెట్‌గా పెవిలియన్ చేరిన శ్రేయాస్.. మూడో టీ20లో తను ఎదుక్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు.
ఇంత ఈజీగా షార్ట్ బాల్‌కు బలయ్యే బ్యాటర్‌ను అంతర్జాతీయ క్రికెట్ ఆడనివ్వకూడదని ఫ్యాన్స్ అంటున్నారంటేనే శ్రేయాస్ ఏ రేంజ్‌లో చికాకు తెప్పించాడో అర్థం చేసుకోవచ్చు. సౌథీ వేసిన షార్ట్ బాల్‌ను ఎలా ఆడాలో తెలియనట్లు తడబడిన అయ్యర్.. స్లిప్స్‌లో ఉన్న నీషమ్ వైపు దాన్ని పంపించాడు. నీషమ్ కొంచెం తడబడినా చివరకు క్యాచ్ పూర్తి చేయడంతో ఆశ్చర్యపోయినట్లు మొఖం పెట్టిన శ్రేయాస్ మైదానం వీడాడు. ఇది చూసిన ఫ్యాన్స్.. సంజూ శాంసన్‌కు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా రెండు మ్యాచుల్లో దరిద్రంగా ఆడిన అయ్యర్‌ను ఎలా కొనసాగిస్తారని అడుగుతున్నారు.

యుజ్వేంద్ర చాహల్
ప్రపంచకప్ జట్టులో ఉన్నా కూడా ఒక్కటంటే ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా చాహల్‌కు దక్కలేదు. ఆ తర్వాత కివీస్‌తో ఆడిన టీ20 మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడీ లెగ్ స్పిన్నర్. మళ్లీ మూడో టీ20లో అతని ప్రదర్శన చూసిన అభిమానులు.. ఇలాంటి వాడిని ప్రపంచకప్‌లో ఆడించకపోవడమే బెటర్ అంటున్నారు. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన చాహల్ ఏకంగా 35 పరుగులు సమర్పించుకున్నాడు.
ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. షార్ట్ బౌండరీలు ఉన్నాయని తెలిసినా కూడా తన బౌలింగ్‌లో వేరియేషన్స్ చూపించలేకపోయిన చాహల్.. డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్ ఇద్దరికీ భారీ షాట్లు ఆడే అవకాశం కల్పించాడు. దాదాపు రెండేళ్లుగా చాహల్ కెరీర్ ఇలాగే కొనసాగుతోంది. రవి బిష్ణోయి వంటి స్పిన్నర్లు అవకాశం వేచి చూస్తున్న తరుణంలో చాహల్ ఇలా ఓ మాదిరి ప్రదర్శనతో ఎక్కువకాలం జట్టులో కొనసాగడం కష్టంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications












