
ముంబై: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కెరీర్ కీలక మలుపు తిరిగింది 2001 ఆస్ట్రేలియా సిరీస్‌లో అని చెప్పొచ్చు. ఆ సిరీస్‌లో బౌలర్, బ్యాట్స్‌మన్ మధ్య ఆధిపత్య పోరు నడిచింది. ముఖ్యంగా హర్భజన్ సింగ్, రికీ పాంటింగ్ మధ్య. ఆ సిరీస్‌లో పాంటింగ్‌ను భజ్జీ ఐదుసార్లు ఔట్ చేశాడు. అప్పటినుంచి ఇద్దరి మధ్య సుదీర్ఘకాలం కోల్డ్ వార్ నడిచింది. ఈ క్రమంలో చాలా సార్లు హర్భజన్ పైచేయి సాధించాడు. అయితే ఓసారి సహనం కోల్పోయిన పాంటింగ్ బ్యాట్‌తో భజ్జీని కొట్టబోయాడట.
తాజాగా స్టార్ స్పోర్ట్స్ షో క్రికెట్ కనెక్టెడ్‌లో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ... 'రికీ పాంటింగ్‌ని తొలిసారి షార్జా వేదికగా వన్డేల్లో ఔట్ చేశాను. నా బౌలింగ్‌లో పాంటింగ్ స్టంపౌట్ అవగా.. పెవిలియన్‌కి వెళ్తున్న అతడ్ని ఉద్దేశించి నేను ఎదో అన్నాను. అప్పట్లో నాకు పెద్దగా ఇంగ్లీష్ వచ్చేది కాదు. కొందరి నోటి నుంచి ఎప్పుడూ ఓ పదం విని ఉండటంతో వాడేశా. అది విన్న పాంటింగ్.. కోపంతో నాపైకి దూసుకొచ్చాడు. నిజంగానే నన్ను బ్యాట్‌తో కొట్టేస్తాడేమో అనిపించింది' అని తెలిపాడు.
'ఆ ఘటన తర్వాత కూడా రికీ పాంటింగ్‌ని చాలాసార్లు ఔట్ చేశాను. ఆ తర్వాత పాంటింగ్.. నేను విసిరే బంతిని కాకుండా నా పేస్‌ని చూసి బ్యాటింగ్ చేసేవాడు. దాంతో ఒక్కోసారి ఆ విషయం నాకు మళ్లీ గుర్తొచ్చేది. పాంటింగ్ నా పేస్‌ని చూసి బ్యాటింగ్ చేస్తుండడంతో.. నా పని సులువైంది. భారత్ గడ్డపైనే కాదు సిడ్నీలోనూ పాంటింగ్‌ని నేను ఔట్ చేశా' అని హర్భజన్ సింగ్ వెల్లడించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో భజ్జీ ఇప్పటివరకు 103 టెస్టుల్లో, 236 వన్డేల్లో, 28 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మరోవైపు పాంటింగ్ ఆసీస్ తరఫున 168 టెస్టులు, 375 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
టెస్టుల్లో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌గా అప్పట్లో కితాబులు అందుకున్న రికీ పాంటింగ్ మొత్తంగా 168 టెస్టు మ్యాచ్‌ల్లో 51.85 సగటుతో 13,378 పరుగులు చేశాడు. ఇందులో 41 సెంచరీలు కూడా ఉన్నాయి. కానీ హర్భజన్ సింగ్‌పై మాత్రం పాంటింగ్‌కి మెరుగైన రికార్డు లేదు. భజ్జీ బౌలింగ్‌లో 22.30 సగటుతో మాత్రమే పరుగులు చేసాడు. 2001 భారత పర్యటనలో ఘోరంగా విఫలమై 5 ఇన్నింగ్స్‌ల్లో 10 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ ఐదు ఇన్నింగ్స్‌ల్లోనూ హర్భజన్ సింగ్‌కే అతను వికెట్ సమర్పించుకున్నాడు. మొత్తంగా టెస్టుల్లో 10 సార్లు అతడ్ని భజ్జీ ఔట్ చేశాడు.
అప్రతిహత విజయాలు కొనసాగిస్తున్న ఆసీస్‌ను 2001లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన టెస్టులో భారత్ మట్టికరిపించిన సంగతి తెలిసిందే. ఫాలోఆన్‌కు వెళ్లి కూడా గంగూలీ సేన 171 పరుగుల తేడాతో గెలిచింది. వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ పోరాట పటిమకు హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ తోడై అసాధ్యం అనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసింది. సౌరవ్ గంగూలీ సారథ్యంలో చారిత్రక విజయం సాధించిన భారత్.. అప్పట్లో సంచలనం సృష్టించింది. విజయంలో లక్ష్మణ్ (59, 281), రాహుల్ ద్రవిడ్ (25, 180), హర్భజన్ సింగ్ (7/123, 6/73) కీలక పాత్ర పోషించారు.