మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్‌కు టీమిండియా వికెట్‌కీపర్ రిషభ్ పంత్ అందుబాటులో ఉండనున్నట్లు బీసీసీఐ తెలిపింది. వికెట్‌కీపర్ బ్యాటర్‌గా పంత్ బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించింది. రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ దాదాపు 14 నెలల పాటు ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి క్రమంగా కోలుకున్నాడు.
అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు పంత్ పూర్తిగా కోలుకుండా లేదా అనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. బ్యాటర్‌గా కొనసాగుతాడా లేదా మునపటిలా వికెట్‌కీపంగ్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తాడా అనే సందేహాలు వచ్చాయి. దీనిపై బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. వచ్చే ఐపీఎల్-2024లో పంత్ వికెట్‌కీపర్-బ్యాటర్‌గా బరిలోకి దిగుతున్నట్లు వివరించింది.

''ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో 2022 డిసెంబర్ 30న ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్ 14 నెలల తర్వాత పూర్తిగా కోలుకున్నాడు. వచ్చే ఐపీఎల్-2024 సీజన్‌లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా అందుబాటులో ఉండనున్నాడు'' అని బీసీసీఐ తెలిపింది.
పంత్‌తో పాటు టీమిండియా పేసర్లు మహ్మద్ షమి, ప్రసిధ్ కృష్ణ గురించి బీసీసీఐ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇటీవల సర్జరీ చేయించుకున్న ఈ స్టార్ పేసర్లు ఐపీఎల్ 17వ సీజన్ మొత్తానికి దూరమవుతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23న ప్రసిధ్ కృష్ణ తన ఎడమకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడని, ప్రస్తుతం బీసీసీఐ వైద్యబృందం పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపింది. త్వరలోనే అతను ఎన్సీఏకి వెళ్తాడని వివరించింది.
అలాగే ఫిబ్రవరి 26న మహ్మద్ షమి కూడా చీలమండ శస్త్రచికిత్స చేయించుకున్నాడని, ప్రస్తుతం షమి వైద్యసిబ్బంది పర్యవేక్షణలో ఉన్నాడని బీసీసీఐ తమ నోట్‌లో వెల్లడించింది. గుజరాత్ టైటాన్స్ జట్టులో షమి కీలక ఆటగాడు. గత సీజన్‌లో గుజరాత్ ఫైనల్‌కు చేరడంలో షమి ముఖ్యపాత్ర పోషించాడు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌లో ప్రసిధ్ కృష్ణ ప్రధాన పేసర్. ప్రసిధ్ లోటును ఇటీవల ట్రేడ్ చేస్తుకున్న అవేశ్ ఖాన్‌తో రాజస్థాన్ భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు పంత్ రీఎంట్రీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రధాన బలంగా మారనుంది. పంత్ గైర్హాజరీలో గత సీజన్‌లో ఢిల్లీ పేలవ ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానానికి పరిమితమైంది. 14 మ్యాచ్‌ల్లో ఢిల్లీ అయిదు మ్యాచ్‌లు మాత్రమే విజయం సాధించింది.