
హైదరాబాద్: 2019 సంవత్సరంలో అత్యధిక ట్వీట్లు చేసిన టాప్-10 భారత క్రీడాకారుల ట్విట్టర్ హ్యాండిల్స్ జాబితాను ట్విట్టర్ ఇండియా మంగళవారం విడుదల చేసింది. క్రికెట్ జెంటిల్మెన్ గేమ్. భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన గేముల్లో ఒకటి. దీంతో భారత్‌లోని చాలా మంది క్రికెటర్లు ట్విట్టర్ ఖాతాలను కలిగి ఉన్నారు.
ట్విట్టర్ ఇండియా విడుదల చేసిన జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత్ నుంచి విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాతి స్థానంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు.
2019లో భారత క్రికెట్ అభిమానులు ఎక్కువగా చర్చించుకున్న అంశాల్లో ధోని రిటైర్మెంట్ ఒకటి. ఈ కారణం చేత ధోని సైతం ఈ ఏడాది ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఒకడిగా నిలిచాడు. ఇంగ్లాండ్‌లో వన్డే వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడంటూ రూమర్లు వచ్చాయి.
అదే సమయంలో వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్‌కు ధోని రెండు నెలలు విరాం ప్రకటించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని ఆ తర్వాత తెలిసిందే. ఇటీవలే ధోనినే స్వయంగా తన రిటైర్మెంట్‌పై జనవరి వరకు మాట్లాడొద్దని అన్న సంగతి తెలిసిందే.
ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు ఉన్నారు. ట్విట్టర్ ఇండియా విడుదల చేసిన ట్వీట్ ఇదే.