మీర్పూర్: భారత్ జట్టు ప్రస్తుతం టీ20 పార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తోందని టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింద్ ధోనీ అన్నాడు. ప్రపంచంలోని ఏ జట్టుతోనైనా .. ఎక్కడైనా.. పోటీపడి ఓడించగలదని ధోనీ ధీమా వ్యక్తం చేశాడు.
తాజాగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో అప్రతిహత విజయాలతో ఫైనల్ చేరిన భారత్ జట్టు ఆదివారం బంగ్లాదేశ్‌తో తుదిపోరుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ధోనీ జట్టు కూర్పుపై మాట్లాడుతూ .. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో జట్టు సమతూకంతో ఉందని తెలిపారు.
నెం.8 వరకు బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు ఉండటం సానుకూలాంశమన్నాడు. అయితే స్వదేశీ పిచ్‌లపై అవగాహన ఉండటంతో ఫైనల్లో బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు గట్టి పోటీ ఎదురుకానుందని వివరించాడు. అయితే, వారిని నిలువరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామన్నాడు.

'మా జట్టును చూడండి. ఇలా ఉండటం తరచుగా జరగొచ్చు. ఈ ఏడాది మేము ఆడిన 10 టీ 20ల్లో తొమ్మిది గెలిచాం. పలు దేశాల్లో వివిధ పరిస్థితుల్లో ఆడాం. నేను కేవలం చెబుతున్నది టీ 20 ఫార్మెట్ గురించి మాత్రమే, వన్డేల గురించి కాదు. మా జట్టులో ముగ్గురు యోగ్యమైన సీమర్లు ఉన్నారు. ఇద్దరు స్పిన్నర్లు, పార్ట్ టైమర్లు కూడా ఉన్నారు.8వ స్థానం వరకూ మా బ్యాటింగ్ పై భరోసా ఏర్పడింది. దాంతో మ్యాచ్ చివర్లో కొన్ని విలువైన పరుగులు కూడా జట్టుకు అదనంగా చేకూరుతాయి. ఇదే సరైన కాంబినేషన్ అనుకుంటున్నా' అని ధోనీ తెలిపాడు.
ఫైనల్లో బంగ్లాదేశ్ జట్టు నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ వారిని నిలువరించే ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపాడు. కాగా, భారత్-బంగ్లాదేశ్ మధ్య ఫైనల్ పోరు మార్చి 6న జరగనుంది.