హైదరాబాద్: ఆతిథ్య శ్రీలంకపై కోహ్లీసేన వన్డే సిరిస్‌ను 5-0తో క్లీన్ స్వీస్ చేసింది. ఇప్పటికే టెస్టు సిరిస్‌ను 3-0తో గెలుచుకున్న కోహ్లీసేన వన్డే సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసి శ్రీలంకకు మరోసారి ఘోర అవమానాన్ని మిగిల్చింది. కొలంబో వేదికగా ఆదివారం జరిగిన ఆఖరి వన్డేలో కెప్టెన్ కోహ్లీ 116 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 110 అజేయంగా నిలవడంతో శ్రీలంక నిర్దేశించిన విజయ లక్ష్యాన్ని అలవోకగా చేధించింది.
దీంతో ఆతిథ్య శ్రీలంకపై ఆరు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 239 పరుగుల విజయ లక్ష్యాన్ని 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టీమిండియా సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 49.4 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసి ఆలౌటైంది.

శ్రీలంకను లంకలో వైట్ వాష్ చేసిన అనంతరం కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ '5-0తో సిరీస్ గెలుచుకోవడం ఎంతో అద్భుతంగా ఉంది. పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఎప్పుడూ సవాలే. కానీ ఈ క్రెడిట్ మా ఆటగాళ్లదే. బుమ్రా అసాధారణంగా ఆడుతున్నాడు. స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. పాండ్యా కూడా రాటుదేలుతున్నాడు. మేం మంచి క్రికెట్‌ను ఆడాం' అని అన్నాడు.
'పరిమిత ఓవర్ల సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లకు మించి గెలువలేరని వాదన ఉంది. ఈ సిరీస్‌కి ముందు వెస్టిండీస్‌పై 3-1తో వన్డే సిరీస్‌ని దక్కించుకున్నాం. కానీ మేం ఇప్పుడు వరుసగా ఐదు వన్డేలు గెలిచాం. నిజానికి వెస్టిండీస్‌లో వరుసగా ఆరు వన్డేలు గెలిచి చూపించాం. ఈ సిరీస్ మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఇదేరకమైన ఆటతీరు కనబరుచాలని ఆశిస్తున్నాం' అని కోహ్లీ అన్నాడు.
ఇక, శ్రీలంక ప్రజలు మంచి ఆతిథ్యాన్ని ఇచ్చారని, తమ ఆటతీరును ఎంతో ప్రశంసించారని, మరోసారి లంక పర్యటనకు రావడానికి ఇష్టపడతామని కోహ్లీ చెప్పడం విశేషం. తాజా విజయంతో శ్రీలంకను శ్రీలంకలో 5-0తో వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా కోహ్లీసేన అరుదైన ఘనత సాధించింది.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేయడం ద్వారా వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(30)తో కలిసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (49) సెంచరీలతో అందరి కంటే ముందున్నాడు.