
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. మైదానంలోనే కాదు. డ్రెస్సింగ్ రూమ్‌లోనూ అంతే కూల్‌నెస్ తో కనిపిస్తాడని సహచర క్రికెటర్లు చాలా సందర్భాల్లో చెప్తూనే ఉన్నారు. ఈ క్రమంలో భారత జట్టుకు స్పిన్నర్‌గా రాణిస్తున్న ధోనీ గురించి, అతని సింప్లిసిటీ గురించి ఇలా చెప్పుకొస్తున్నాడు. అతను టీమిండియా తరపున తొలి వన్డే ఆడుతున్న సందర్భంలో జరిగిన సంఘటన ఇది.
జింబాబ్వే పర్యటనలో ధోనీ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకున్నాను. ధోనీని మొదటిసారి అప్పుడే కలిశాను. అతనితో మాట్లాడ్డానికి చాలా భయపడేవాడిని. కానీ, ధోనీ చాలా సింపుల్‌గా ఉండేవాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో ఘనతలు సాధించిన ధోనీ అంత సింపుల్‌గా ఉన్నాడేంటా? అని ఆశ్చర్యపోయేవాడిని. ఆ పర్యటనలో ఓ మ్యాచ్ సమయంలో నేనే ధోనీని సర్ అని పిలిచాను. అప్పుడు ధోనీ నన్ను దగ్గరకు పిలిచి.. ధోనీ, మహి, భాయ్.. వీటిల్లో ఏదో ఒక పేరు సెలెక్ట్ చేసుకుని నన్ను పిలువు. సర్ అని మాత్రం పిలువొద్దు అన్నాడు. అంత పెద్ద ఆటగాడిని పేరు పెట్టి పిలవడానికి చాలా ఇబ్బంది పడ్డానని చాహల్ చెప్పాడు.
అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజ స్పిన్నర్లు టీమిండియాకు దూరమైన తర్వాత యజువేంద్ర చాహల్, కుల్‌దీప్ వంటి స్పిన్నర్లు తమ సత్తా చాటుతున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం టీమిండియాలో కీలక ఆటగాళ్లుగా మారారు. 2016 జూన్‌లో చాహల్ భారత్ తరఫున అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లోకి ప్రవేశించాడు.
ఆ సమయంలో మిస్టర్ కూల్ ధోనీతో ఎలా ప్రవర్తించాలనే విషయంలో చాలా గందరగోళ పడేవాడట. ఆ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చాహల్ పంచుకున్నాడు. కాగా ఐపీఎల్‌కు ముందు చాహల్ దక్షిణాఫ్రికా పర్యటనలో చాహల్ అద్భుతమైన ప్రదర్శన చేసి కీలక వికెట్లు తీయగలిగాడు. ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించిన చాహల్.. పెద్దగా రాణించలేకపోయాడు.