భారత జట్టు దశాబ్ద కాలంగా ఐసీసీ ట్రోఫీ నెగ్గలేదు. దీనికి కారణం ఈ జట్టు ఒక యూనిట్‌లా ఆడలేపోవడమే అని మాజీ దిగ్గజం హర్భజన్ సింగ్ అన్నాడు. ప్రస్తుతం టీమిండియాలో ఒత్తిడిని తట్టుకొని ఆడగలిగే వాళ్లు కేవలం ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఉన్నారని భజ్జీ అన్నాడు. కానీ ఐసీసీ ట్రోఫీలు నెగ్గాలంటే జట్టు అంతా కలిసి ఒకే లక్ష్యం దిశగా సాగాలని సూచించాడు.
2007 టీ20, 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో భారత జట్టు ఏ మంత్రం ఫాలో అయిందని, ఆ తర్వాత అది టీంలో ఎందుకు మిస్ అయిందని భజ్జీని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన అతను.. 'అది నాక్కూడా తెలీదు. అప్పట్లో మా టీంలో ఏం ఉంది? ఇప్పుడు టీంలో ఏం లేదు? అంటే చెప్పడం నాకు చాలా కష్టం. ఎందుకంటే.. దేశం కోసం ఆడే ప్లేయర్లు ఎప్పుడైనా సరే.. గెలవడమే లక్ష్యంగా ఆడతారు' అని వెల్లడించాడు.

'మన టీం 2015, 2019 వరల్డ్ కప్‌లల సెమీఫైనల్స్ వరకు వెళ్లింది. కానీ ఐసీసీ ట్రోఫీ దక్కలేదు. ఒత్తిడిన తట్టుకొని నిలబడి చివర్లో పోరాడి జట్టును గెలిపించే సత్తానే దీనికి కారణమేమో? ప్రస్తుతం టీంలో అది కేవలం ఒరిద్దరు ఆటగాళ్లలోనే ఉంది. అయితే పెద్ద టోర్నీలు గెలవాలంటే అందరూ ఒక టీంగా ఆడాల్సి ఉంటుంది' అని భజ్జీ వివరించాడు.
2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత చాలా ఐసీసీ టోర్నీల్లో భారత జట్టు ఫైనల్ లేదా సెమీఫైనల్ వరకు వెళ్లింది. కానీ ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. దీనిపై మాట్లాడిన భజ్జీ.. 'మన దగ్గర విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఉన్నారు. వీళ్లు చాలా పెద్ద ప్లేయర్లు. కానీ వీళ్లతోపాటు మిగతా 8-10 మంది ప్లేయర్లు, టీం మేనేజ్‌మెంట్, అందరూ ఒకే లక్ష్యంతో ముందుకు సాగాలి' అని చెప్పాడు.
ఈ విషయంలో వరల్డ్ కప్ గెలిచిన తమ జట్టుకు, ప్రస్తుతం జట్టుకు మధ్య తేడా ఏంటో కూడా ఈ మాజీ దిగ్గజం చెప్పేశాడు. 'ఒక్క సింగిల్ ఆపడం, అద్భుతమైన రనౌట్.. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మ్యాచ్‌ను మలుపు తిప్పేస్తాయి. అలాంటి సమయంలో జట్టు అంతా ఒక టీంలా ఆడితే.. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ప్రస్తుత టీం కన్నా ఈ విషయంలోనే మా టీం కొంచెం మెరుగ్గా ఉండేది అనుకుంటున్నా. కేవలం ట్యాలెంట్ చూస్తే మాత్రం.. మా కన్నా ఇప్పటి టీం చాలా మెరుగైందనే చెప్పాలి' అని భజ్జీ పేర్కొన్నాడు.